
జూన్ 1 నుంచి రేషన్‌కార్డుదారులకు అందించనున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: వానాకాలంలో భారీ వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పేదలకు మూడు నెలల ముందే రేషన్ అందించాలన్న కేంద్రం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. జూన్, జూలై, ఆగస్టుకు అవసరమైన సన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల్లో అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం సూచనల మేరకు జూన్ ఒకటి నుంచి 30లోగా మూడు నెలల రేషన్ పంపిణీ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి నెలా ఇచి్చనట్లుగానే ఆహార భద్రతా కార్డుదారులకు ఒక్కొక్కరికీ 6 కిలోల చొప్పున ఒకేసారి మూడు నెలల బియ్యాన్ని అందిస్తామన్నారు. అంత్యోదయ ఆహార భద్రతా కార్డుదారులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డుదారులకు కిలో పంచదార రూ. 13.50 చొప్పున, గోధుమలు కిలో రూ. 7 చొప్పున జీహెచ్‌ఎంసీలో ఐదేసి కేజీలు, కార్పొరేషన్లలో రెండేసి కేజీలు పంపిణీ చేస్తామ న్నారు. రేషన్ పంపిణీపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అధికారులు ప్రచా రం చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు.