
పండించిన రైతుకే అమ్ముకునే అవకాశం
మద్దతు ధర విక్రయాలపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు
ఈ సీజన్ నుంచి పీఎం–ఆశా కింద మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా కొత్త విధానంలో కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రైతులు పండించిన పంటను తక్కువ ధరకు కొనుగోలు చేసి, అక్రమ పద్ధతుల్లో కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు విక్రయించే దళారులకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెడుతోంది. పండించిన రైతు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో తమ పంటను విక్రయించుకునేలా చర్యలు చేపట్టింది.
రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) హామీ ఇచ్చేలా రూపొందించిన ‘పీఎమ్–ఆశా’పథకం కింద ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్), మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం (ఎంఐఎస్) అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖలోని పెట్టుబడి, మద్దతు ధర విభాగం నుంచి ఈనెల 18న ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఇవి అమల్లోకి వచ్చేలా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అక్రమాలకు చెక్ పెట్టేందుకే...
బహిరంగ మార్కెట్‌లో ధర లేనప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే మద్దతు ధర ఇచ్చి పంటలను కొనుగోలు చేసే విధానం కొంతకాలంగా దేశంలో అమలవుతోంది. అయితే దీనిని దళారులు దుర్వినియోగం చేస్తున్నారు.
» వరి, పత్తి కందులు, మొక్కజొన్న, పెసర, జొన్నలు, మినుములు మొదలైన పలు రకాల పంటలకు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.
» ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎఫ్‌సీఐ సేకరిస్తుండగా, పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తుంది. ఇవి కాకుండా పెసలు, సోయా బీన్, మినుములు వంటి పంటలను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్‌సీసీఎఫ్, నాఫెడ్ కొనుగోలు చేస్తాయి.
» కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ జొన్నలు, మక్కలు మొదలైన పంటలను రైతుల నుంచి సేకరిస్తుంది. అయితే ఇక్కడే అక్రమాలకు తెర లేస్తోంది. పంట నాణ్యత లేదని రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే దళారులు, ప్రైవేటు వ్యాపారులు తిరిగి ఆ పంటనే మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, సీసీఐ వంటి సంస్థలతో కుమ్మక్కై రైతుల పేరిట మద్దతు ధరకు విక్రయిస్తున్నారు.
» గత సంవత్సరం పత్తి పంటకు సంబంధించి ఇలాంటి అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ద్వారా ధ్రువీకరించి, కేంద్రానికి పంపించింది.
» గతంలో మార్క్‌ఫెడ్ ద్వారా జరిగిన జొన్నల కొనుగోళ్లలో కూడా దళారులే రైతుల పేరిట విక్రయాలు జరిపినట్టు రుజువైంది.
» దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి అక్రమాలకు చెక్ పెడుతూ రైతులే లబ్ధిదారులుగా ఉండేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించింది.
రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ...
ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) ప్రత్యేక పోర్టల్‌లో రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కూడా రైతు డేటాను కేంద్రం సేకరిస్తుంది.
» రాష్ట్ర పోర్టల్‌లో రైతులు తప్పనిసరిగా రిజిస్టర్ కావాలి. డీసీఎస్/అగ్రి–స్టాక్ ఇంటిగ్రేషన్ ద్వారా పంట వివరాలు ధ్రువీకరించాలి. లేనిచోట పాత పద్ధతిలోనే వెరిఫికేషన్ చేపడతారు.
» రైతు ఆధార్, పట్టాదార్‌పాస్ పుస్తకంతో పాటు క్రాప్ బుకింగ్ డేటా ఆధారంగా రైతు ఏ పంట వేశారనే అంశాలను వ్యవసాయ శాఖ నుంచి సేకరించి, పంటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ వంటి కేంద్ర నోడల్ ఏజెన్సీలతో రైతుల డేటాను అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
» డిజిటల్ క్రాప్ సర్వే, అగ్రి–స్టాక్ డేటాతో ఆటో వెరిఫికేషన్ తప్పనిసరి.
» ఒకవేళ రైతులు తమ పంటలను విక్రయించడానికి నేరుగా రాని పక్షంలో తన ఆధార్ నంబర్‌తో గరిష్టంగా ముగ్గురికి ఆథరైజేషన్ ఇచ్చి పంటల విక్రయానికి పంపించే అవకాశం ఉంటుంది. రైతు హాజరు కాకపోతే, అతడి అధీకృత ప్రతినిధి ఉత్పత్తిని కొనుగోలు కేంద్రానికి తెచ్చే వీలు ఉంటుంది. చెల్లింపు మాత్రం నేరుగా రైతు (యజమాని) బ్యాంక్ ఖాతాకు మాత్రమే వెళుతుంది.
» ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు తప్పనిసరి. ఓటీపీ ద్వారా ధ్రువీకరణకు అనుమతి ఉండదు. తద్వారా రైతుల పేరిట దళారులు పంటలను బల్క్‌గా విక్రయించే అవకాశం ఉండదు.
» రైతులకు చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా ఆధార్ వెరిఫైడ్ ఖాతాల్లోనే జరుగుతాయి. ఆధార్ చట్టం 2016 సెక్షన్ 7 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి, ఈనెల 30లోపు రాష్ట్రాలు దీనిని కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది.
» నిజమైన రైతులకే మద్దతు ధర ప్రయోజనం చేరేలా చూడటం, మధ్యవర్తుల జోక్యం తగ్గించడంతోపాటు కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉంచడం ఈ మార్గదర్శకాల ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.