ఐటీకి నీటి ట్రాన్స్‌ఫర్‌ | Bengaluru: IT Employees Work From Home Amid Serious Water Crisis, Details Inside - Sakshi
Sakshi News home page

Bengaluru Water Crisis: ఐటీకి నీటి ట్రాన్స్‌ఫర్‌

Published Fri, Mar 22 2024 4:05 AM

Bengaluru: IT employees Work from Home amid serious water crisis - Sakshi

బెంగళూరులో తీవ్రమైన నీటి సంక్షోభం 

దీంతో హైదరాబాద్, పుణేకు ఉద్యోగులు షిఫ్ట్‌ 

సొంతూళ్ల నుంచి పనిచేసే వీలు కూడా.. 

వేతన పెంపు, ఇతరత్రా అలవెన్స్‌ల చెల్లింపులు 

వరంగల్‌కు చెందిన నిఖిలేశ్‌ కొన్నేళ్లుగా బెంగళూరులోని ఓ బహుళజాతి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవలే పెళ్లి కావడంతో భార్యతో సహా కేఆర్‌ పురంలో నెలకు రూ.20 వేల అద్దెతో ఓ గేటెడ్‌ కమ్యూనిటీలో కాపురం పెట్టాడు. అయితే ఈమధ్య కాలంలో బెంగళూరు ప్రధాన నగరంలో నీటి ఎద్దడి తీవ్రం కావడంతో యాజమాన్యం ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చింది.

కానీ, అపార్ట్‌మెంట్‌లో నీటి వినియోగం, సరఫరాలో రెసిడెన్షియల్‌ సొసైటీ ఆంక్షలు విధించింది.దీంతో అటు ఆఫీసుకు వెళ్లలేక, ఇటు ఇంట్లో ఉండలేక ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో హైదరాబాద్‌లో ఉన్న బ్రాంచ్‌ ఆఫీసు నుంచి పని చేయాలని సూచించింది. అతడు భార్యను పుట్టింట్లో వదిలిపెట్టి ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచే పనిచేస్తున్నాడు.

సాక్షి, హైదరాబాద్‌:.. ఇదీ బెంగళూరులోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) ఉద్యోగికి జరిగిన నీళ్ల బదిలీ. సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూరు గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలకు కేంద్రమైన వైట్‌ఫీల్డ్, వర్తూర్‌ వంటి ఐటీ హబ్‌లలో ఈ సమస్య తీవ్రంగా ఉంది.దీంతో ఐటీ సంస్థలు, ఉద్యోగుల కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ఐటీ హబ్‌లు, ఉద్యోగుల నీటి కష్టాలు వీడియో పలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ కావడం గమనార్హం. 

హైదరాబాద్, పుణేలకు బదిలీ
దేశీయ ఐటీ పరిశ్రమ అమెరికా, యూకే, యూరప్, ఆస్ట్రేలియా వంటి పలు దేశాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దీంతో రాజకీయ అస్థిరత, స్థానిక సమస్యలతో సంబంధం లేకుండా గడువులోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు తప్పనిసరి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఐటీ పరిశ్రమ నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. తాత్కాలికంగా కొద్దికాలం పాటు ఉద్యోగులను సొంతూళ్ల నుంచి పని చేసే వీలు కల్పించడం, హైదరాబాద్, పుణే వంటి ఇతర నగరాల్లోని బ్రాంచ్‌ ఆఫీసులకు బదిలీ చేయడం వంటివి చేస్తున్నాయి. విధి నిర్వహణలో ఎదురయ్యే సందేహాలు, టాస్క్‌లను నివృత్తి చేసేందుకు సాంకేతిక నిపుణులను జూమ్‌ వంటి ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే ఉద్యోగుల పనితీరుపై ఒత్తిడి ప్రభావం పడకుండా వారాంతాల్లో వర్చువల్‌గా శిక్షణ, మీటింగ్‌లను సైతం నిర్వహిస్తున్నాయి. 

వేతన పెంపు, అలవెన్స్‌లు కూడా.. 
ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ఇచ్చినా బెంగళూరు నుంచే పని చేస్తారని, దీంతో అపార్ట్‌మెంట్లలో నీటి సమస్య మరింత తీవ్రమవుతుందని భావించిన పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోం బదులుగా వర్క్‌ ఫ్రం హోంటౌన్‌ (సొంతూర్ల నుంచి పని) చేయాలని సూచిస్తున్నాయి. అయితే ఉద్యోగులు ఇతర పట్టణాలు/మెట్రో సిటీల నుంచి పని చేయాలంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. కుటుంబంతో సహా వేరేచోటుకు మారడం, ప్రయాణ ఖర్చులతోపాటు అప్పటికే బెంగళూరులో ఉండే ఇంటికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఉద్యోగులకు భారం కావడంతో పలు కంపెనీలు తాత్కాలిక వేతన పెంపు, అలవెన్స్‌లు వంటివి ఇస్తున్నాయి. బెంగళూరులో నీటి సమస్య తీరిన తర్వాత తిరిగి ఆఫీసుకు రావాలని చెబుతున్నాయి. 

రోజుకు 500 మిలియన్‌ లీటర్ల నీటి కొరత 
ప్రస్తుతం కర్ణాటకలో సుమారు 8,785 ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీల్లో 18 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా పెరుగుదల, అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక, లోటు వర్షపాతం, తలసరి నీటి వినియోగం పెరుగుదల వంటి కారణాలతో బెంగళూరులో నీటి సమస్య జఠిలమైంది. నగరంలో రోజుకు తాగునీరు, పరిశ్రమ అవసరాలకు 2,600 ఎంఎల్‌డీ (రోజుకు మిలియన్‌ లీటర్లు) నీరు అవసరం ఉండగా.. ఇందులో 1,450 ఎంఎల్‌డీలు కావేరి నది నుంచి, 650 ఎంఎల్‌డీలు బోరు బావుల నుంచి సమకూరుతుండగా, 500 ఎంఎల్‌డీల నీటి కొరత ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గేటెడ్‌ కమ్యూనిటీలు, పెద్ద నివాస సముదాయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, అగ్నిమాపక కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లు కూడా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. 

ఐటీ ఆఫీసులపై ప్రభావం 
బెంగళూరులో నీటి సమస్య ఐటీ కార్యాలయాల మీద కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. మహాదేవపుర,కెంగేరి, వైట్‌ ఫీల్డ్, సజ్జాపుర్‌ రోడ్, కోర మంగళ వంటి ప్రాంతాల్లోని ఐటీ సంస్థలు, ఉద్యోగులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో పలు సంస్థలు రిమోట్‌ వర్కింగ్, హైబ్రిడ్‌ మోడల్‌ పని విధానంతోపాటు ఇతర నగరాల్లోని బ్రాంచీల నుంచి పని చేయాలని ఉద్యోగులకు సూచిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఇలా పని చేస్తున్నారు.    –సందీప్‌ కుమార్‌ మఖ్తల, ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ అసోసియేషన్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement