
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవో విడుదలైంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. జీవో విడుదల చేసింది. జీవో నెం.9ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది.
బీసీ కులగణన ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వేను అనుసరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించింది. నూతన పీఆర్ చట్టానికి అసెంబ్లీ ఆమోదించిన సవరణలకు అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, జెడ్‌పీటీసీలు, జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే.
ఎస్టీ, ఎస్సీ, బీసీలు ఇలా అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్ సీట్లన్నీ కూడా ఎస్టీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా, మొత్తం సీట్లలో 50 శాతానికి తగ్గకుండా చేశారు. ఈ ఏరియాల్లోని మండల అధ్యక్షుల పదవులన్నీ కూడా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ రిజర్వేషన్ల ఖరారును పంచాయతీరాజ్ కమిషనర్, మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ స్థానాలను జిల్లా కలెక్టర్లు, మండలాల్లో ఎంపీటీసీ రిజర్వేషన్లను ఆర్డీవోలు ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ఆధారంగా.. బీసీ రిజర్వేషన్లను కులగణన (ఎస్‌ఈఈఈపీసీ) సర్వే 2024 ప్రకారం పూర్తి చేశారు.