ఆ కేసు కథ కంచికేనా?

Banjara Hills Inspector Caught By Taking Money  - Sakshi

అత్యాచారం కేసును అనుకూలంగా మార్చుకున్న ఖాకీ 

నిందితులకు వత్తాసు, బాధితురాలికి తీవ్ర బెదిరింపులు 

ఫిర్యాదు వెనక్కు తీసుకోకుంటే చోరీ కేసు పెడతానని 

గత ఏడాది వెలుగులోకి ఓ మాజీ ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారం 

ఆయనపై కేసు నమోదుకు నిర్ణయించిన ఉన్నతాధికారులు 

ప్రస్తుతం దీనిపై మిన్నకుండిపోయిన నగర పోలీసు విభాగం

సాక్షి, హైదరాబాద్: ఇతర కేసుల మాట ఎలా ఉన్నా.. అత్యాచారం ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులకు మాత్రం పోలీసులు ప్రాధాన్యం ఇస్తారు. బాధితురాలిని వెంటనే భరోసా సెంటర్‌కు పంపడంతో పాటు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు. దీనికి తోడు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కూడా తోడయ్యే వాటి విషయంలో మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటారు. అయితే బంజారాహిల్స్‌ ఠాణాలో ఇన్‌స్పెక్టర్‌గా పని చేసి, లంచం ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదై, ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ అధికారి తీరు మాత్రం దీనికి భిన్నం. 

తన వద్దకు వచ్చిన బాధితురాలికి న్యాయం చేయడం మాట అటుంచి ‘పెద్దలైన’ నిందితులతో కలిసి ఆమెనే బెదిరించాడు. ఈ కారణంగానే దారుణమైన ఉదంతానికి సంబంధించిన ఈ కేసు నమోదు దాదాపు నాలుగు నెలలు ఆలస్యమైంది. ఎట్టకేలకు విషయం బయటకు రావడంతో తీవ్రంగా స్పందించిన ఉన్నతాధికారులు కేసును సీసీఎస్‌కు బదిలీ చేయడంతో పాటు సదరు ఇన్‌స్పెక్టర్‌ను నిందితుడిగా చేర్చాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు.  

అప్పట్లోనే ఫిర్యాదు చేసిన బాధితురాలు... 
జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ మాజీ ఛైర్మన్‌ మురళీ ముకుంద్, ఆయన కుమారుడు ఆకర్ష్ కృష్ణ బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లో నివసిస్తున్నారు. వీరి వద్ద పని చేస్తున్న ఓ దళిత యువతిపై (22) అత్యాచారం చేశారన్నది ప్రధాన ఆరోపణ. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు గత ఏడాది జూన్‌లో బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సమాచారం అందుకున్న మురళీ ముకుంద్‌ కుటుంబీకులు ఈ కేసు నమోదు కాకుండా చూడటానికి ఆ బాధితురాలినే బెదిరించాలని పథకం వేశారు.

 ఈ విషయాన్ని అప్పట్లో బంజారాహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. ఆయన ప్రోద్భలంతో ముకుంద్‌ కుటుంబీకులు బాధితురాలిపై ఓ ‘చిత్రమైన కేసు’ పెట్టారు. ఆమె తమ ఇంట్లో పని చేస్తూ ఐఫోన్‌లోని సిమ్‌కార్డులు తస్కరించినట్లు అందులో ఆరోపించారు. ఈ ఫిర్యాదును బాధితురాలికి చూపించిన సదరు ఇన్‌స్పెక్టర్‌ బెదిరింపులకు దిగారు. ముకుంద్‌ కుటుంబీకులపై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోకపోతే ఈ ఫిర్యాదు ఆధారంగా క్రిమినల్‌ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు.  

ఆమెకు జరిగిన అన్యాయానికి రేటు... 
అక్కడితో ఆగకండా ఆ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపిస్తానంటూ హెచ్చరించాడు. పలుమార్లు ఆమెకు ఫోన్‌ చేసిన సదరు అధికారి పదేపదే బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమెకు జరిగిన అన్యాయానికి రూ.1.7 లక్షల రేటు కట్టిన ఇన్‌స్పెక్టర్‌ ముకుంద్‌ కుటుంబీకుల నుంచి ఆ మొత్తం ఇప్పిస్తానని చెప్పాడు. 

ఈ సెటిల్‌మెంట్‌ చేసినందుకు సదరు అధికారికి భారీ మొత్తమే ముకుంద్‌ కుటుంబీకుల నుంచి అందినట్లు తెలిసింది. ఈ ఖాకీ బెదిరింపులకు భయపడిన బాధితురాలు తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని మిన్నకుండిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన పరిణామాలతో ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న బాధితురాలు ధైర్యం చేసి మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు విషయాన్ని అప్పటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. వారి ఆదేశాల మేరకు ఈ కేసును మహిళ భద్రత విభాగం అధికారులకు అప్పగించారు. 

ఒక్కొక్కటిగా వెలుగులోకి వాస్తవాలు.. 
తమ దర్యాప్తులో భాగంగా మహిళ భద్రత విభాగం బాధితురాలిని సంప్రదించింది. ఆమె నుంచి వాంగ్మూలం సైతం నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే గత ఇన్‌స్పెక్టర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళ భద్రత విభాగం అధికారులు నగర పోలీసు కమిషనర్‌కు నివేదిక అందించారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన బంజారాహిల్స్‌ మాజీ ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదుకు ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధక చట్టంలో ఓ కీలకాంశం ఉంది. 

ఈ ఆరోపణల కింద వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి నిరాకరించిన, దర్యాప్తులో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులనూ నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అత్యాచారం కేసును దర్యాప్తు నిమిత్తం నగర నేర పరిశోధన విభాగానికి (సీసీఎస్‌) బదిలీ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మురళీ ముకుంద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మాజీ ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకునే అంశానికి అనివార్య కారణాల నేపథ్యంలో బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.  

whatsapp channel

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top