నమ్మించి నరక కూపంలోకి..

Bangladesh Girls In Hyderabad For Prostitute - Sakshi

హైదరాబాద్‌ వేశ్యావాటికల్లో బంగ్లా యువతులు 

అక్రమంగా దేశసరిహద్దులు దాటిస్తున్న ముఠాలు

సాక్షి, హైదరాబాద్‌ : బంగ్లాదేశ్‌లో బతుకుదెరువు లేక చాలా పేద కుటుంబాలు అక్రమంగా భారత్‌కు వలస వస్తుంటాయి. అయితే ఉపాధి పేరిట కొందరు బంగ్లాదేశ్‌ యువతులకు డబ్బు ఎరవేసి అక్రమంగా సరిహద్దులు దాటించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. ఏజెంట్ల మాటలు నమ్మి వచ్చిన వారిని నరకకూపంలోకి నెడుతున్నారు. ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్లలేక.. కుటుంబ కష్టాలను గుర్తుకు తెచ్చుకుని, ఇష్టం లేకున్నా మనసు చంపు కొని నిర్వాహకులు ఎలా చెబితే అలా చేస్తున్నారా యువతులు. చదువు రాకపోవడం, బెంగాలీ తప్ప మరో భాష తెలియకపోవడంతో ఎవరితోనూ తమ బాధలు చెప్పుకోలేని నిస్సహాయ స్థితి. రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వెలుగుచూసిన హైటెక్‌ సెక్స్‌ రాకెట్‌  బంగ్లాదేశ్‌ యువతుల బాధలకు అద్దం పడుతోంది.

19–25 ఏళ్లలోపు వారే టార్గెట్‌
బంగ్లాదేశ్‌లో పేదరికం, నిరక్షరాస్యత ప్రధానంగా ప్రజలను పీడిస్తున్న అంశాలు. ఈ నేపథ్యంలో భారత్‌కు అక్రమంగా వచ్చిన కొందరు డబ్బు సంపాదనకు వక్రమార్గం పట్టారు. ‘భారత్‌లోని వేశ్యావాటికల్లో యువతులను ఉంచితే ఎవరికీ అనుమానం రాదు, పైగా తక్కువ సమయంలో ఎక్కువగా సంపాదించొచ్చు’అన్న దురాశతో ఇదే పనిని వృత్తిగా ఎంచుకున్నారు. బంగ్లాదేశ్‌లోని వీరి ఏజెంట్లు తమకు తెలిసిన మురికివాడల్లోని పేదలను సంప్రదిస్తారు. భారత్‌లో బాగా స్థితిమంతుల ఇళ్లు, హోటళ్లలో పనిచేసే అవకాశాలు ఉన్నాయంటూ అమ్మాయిలను పంపాలని కోరతారు. చిన్నపిల్లలైతే ఇబ్బందులు వస్తాయన్న అనుమానంతో 19 నుంచి 25 ఏళ్ల యువతులను ఎంపిక చేసుకుంటారు. పాస్‌పోర్ట్, వీసాలు లేకుండానే వీరిని అక్రమమార్గాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లోని వేశ్యా గృహాల్లో ఉంచుతారు.

త్వరలో ఎన్‌ఐఏకు కేసు బదిలీ! 
అబ్దుల్లాపూర్‌మెట్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వింగ్‌ బాటసింగారం సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. వారి చెరలో మగ్గుతున్న ఇద్దరు యువతులను రక్షించారు. ఈ రాకెట్‌ ప్రధాన సూత్రధారుల్లో ఒకడైన లిటన్‌ సర్కార్‌ది బంగ్లాదేశ్‌. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కావడంతో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ 
(ఎన్‌ఐఏ)కు త్వరలో బదిలీ కానుంది.

 యాప్‌లతో దందా 
లాక్‌డౌన్‌ కాలంలో వ్యాపారం తగ్గిందని చాలామంది నిర్వాహకులు అక్రమమార్గంలో తీసుకొచ్చిన బంగ్లాదేశీ యువతులను తిరిగి స్వదేశానికి పంపించేస్తున్నారు. అయితే కడుబీదరికంలో ఉన్న కొందరు మాత్రం ఇక్కడే ఉండిపోతున్నారు. డేటింగ్‌ యాప్స్‌లో ఈ యువతుల చిత్రాలు ఉంచి విటులను ఆకర్షిస్తున్నారు. గూగుల్‌పే, ఫోన్‌ పే ద్వారా చెల్లింపులు చేస్తే.. వారి వద్దకు యువతులను పంపడం లేదా విటులనే రప్పించుకోవడం పనిగా పెట్టుకున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top