
బంజారాహిల్స్: టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఢిల్లీలో ఏఐసీసీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు సోనియాగాంధీతో మంగళవారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ గెలిచేందుకు చేపట్టిన ప్రణాళికలను వివరించారు. అనంతరం అజారుద్దీన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరికి సందేహం అవసరం లేదని టికెట్ ను అధిష్టానం తనకే కేటాయిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చేస్తున్నదని, కాలనీవాసులకు బస్తీ వాసులకు ఉన్న సమస్యలను ఇప్పటికే గుర్తించి అధికారులకు చర్చించి నిధులు మంజూరు చేయించి పనులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని కాలనీలు బస్తీలు అభివృద్ధిలో వెనక పడ్డాయని నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం లో వందలాది సిసి రోడ్డు, మురుగునీటి కాలువలు, వరద నీటి కాలువలు నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని అన్నారు.