
తొలి దశలో మైనర్ మినరల్స్ ద్వారా రూ.56 కోట్ల ఆదాయం
రెండో విడతలో 34 బ్లాకుల కోసం కొనసాగుతున్న వేలం ప్రక్రియ
మొదటి దశలో వేలానికి ముందే అటవీ, పర్యావరణ అనుమతులు
రెండో దశలో బ్లాకులు దక్కించుకున్న వారిపైనే అనుమతుల భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 చిన్న తరహా ఖనిజాల బ్లాకుల కోసం క్వారీ లీజులు మంజూరు చేసేందుకు గనులు, భూగర్భ వనరుల శాఖ రెండోవిడత వేలానికి సిద్ధమవుతోంది. ఈ బ్లాకులకు సంబంధించి గత నెల 17న నోటిఫికేషన్ విడుదల కాగా, ఈ నెల 14 నుంచి 22వ తేదీల నడుమ వేలం వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 25 నాటికి ఖనిజ బ్లాకుల క్వారీల వేలం పూర్తవుతుందని గనులు, భూగర్భ శాఖ ప్రకటించింది. బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్, రఫ్ స్టోన్, మెటల్, గ్రావెల్, లేటరైట్, బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, మొజాయిక్ చిప్ బ్లాకులు వేలం వేయనున్నారు.
2015 ఖనిజ వేలం నియమావళిని అనుసరించి తొలివిడతలో ఈ ఏడాది ఏప్రిల్‌లో గనులు, భూగర్భ శాఖ సుమారు 75 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న 256 మినరల్ బ్లాక్‌లకు వేలం వేసింది. 19 బ్లాక్‌ల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.56 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం రెండో దశలో 34 మినరల్ బ్లాకుల వేలం జరగనుండటంతో ప్రభుత్వ ఖజానాకు సమకూరే ఆదాయంపై ఆసక్తి నెలకొంది. అయితే తొలి విడతతో పోలిస్తే రెండో విడతలో బ్లాకుల వేలానికి పెద్దగా స్పందన వచ్చే అవకాశం లేదని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్యావరణ అనుమతులే కీలకం
తొలివిడత ఖనిజ బ్లాకుల వేలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అటవీ, పర్యావరణ అనుమతులు సాధించి తెచ్చింది. రెండో విడతలో 34 చిన్న తరహా ఖనిజ బ్లాకులు వేలం ద్వారా పొందే లీజుదారులు అటవీ, పర్యావరణ అనుమతులు సొంతంగా సాధించుకోవాల్సి ఉంటుంది. అనుమతుల భారం లీజుదారులపైనే ఉండటంతో వేలంలో పాల్గొనేందుకు ఔత్సాహికులు వెనుకంజ వేస్తున్నట్టు గనుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. 5 హెక్టార్లకు పైబడిన విస్తీర్ణంలో ఉన్న బ్లాకులను వేలం ద్వారా పొందేవారు రాష్ట్ర అటవీ శాఖ అనుమతులు పొందాలనే టెండరు నిబంధన విధించారు.
అనుమతుల కోసం వెళ్లే లీజుదారులకు పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనేక అభ్యంతరాలు, సవాళ్లు ఎదురవుతున్నాయి. మరోవైపు ఖనిజాల మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్న పర్యావరణ పరిరక్షణ సంస్థలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వంటి సంస్థలను ఆశ్రయిస్తే వేలంలో బ్లాకులను దక్కించుకున్నా ముందుకు సాగే అవకాశముండదనే అభిప్రాయం ఔత్సాహికుల్లో నెలకొంది. ప్రభుత్వమే చొరవ తీసుకొని అటవీ, పర్యావరణ అనుమతులు ఇప్పిస్తేనే వేలంలో పాల్గొంటామని చెబుతున్నారు.
సున్నపురాయి గనుల్లోనూ..!
సూర్యాపేట జిల్లా పసుపుల బోడులో సున్నపురాయి గనుల తవ్వకానికి లీజు మంజూరు కోసం గత ఏడాది అక్టోబర్‌లో మూడు బ్లాక్‌లను గనుల శాఖ వేలం వేసింది. వేలంలో ఈ బ్లాకులను దక్కించుకున్న లీజుదారులు కూడా పర్యావరణ, అటవీ అనుమతులు సాధించడంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నట్టు మైనింగ్ అధికారులు చెబుతున్నారు.
పసుపులబోడు గనుల లీజు పొందిన వారికి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చేందుకు ఐదు నుంచి ఏడేళ్ల కాలం పట్టే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే అన్ని అనుమతులు సాధించిన తర్వాత ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియను కొనసాగించాలనే డిమాండ్ వినిపిస్తోంది.