నెల రోజులకు చిక్కి.. గంటల్లో చెక్కేశాడు! | Accused Escapes From Narsingi Police Station Hyderabad Crime News | Sakshi
Sakshi News home page

నెల రోజులకు చిక్కి.. గంటల్లో చెక్కేశాడు!

Jul 2 2026 7:45 AM | Updated on Jul 2 2026 7:45 AM

Accused Escapes From Narsingi Police Station Hyderabad Crime News

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ నుంచి నిందితుడు పరార్‌

డ్రగ్స్‌ కేసులో ఈగల్‌ టీం అరెస్టు

నార్సింగి పోలీసులకు అప్పగింత

తెల్లవారుజామున అదనుచూసి జంప్‌

హైదరాబాద్‌, మణికొండ: నిషేధిత హష్‌ ఆయిల్‌ అమ్ముతున్న ముఠాను ఈగల్‌ టీం నెల రోజుల పాటు కాపు కాసి.. మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం అరెస్టు చేసింది. తదుపరి విచారణ, కోర్టులో హాజరుపర్చటం నిమిత్తం వారిని నార్సింగి పోలీసులకు సాయంత్రం అప్పజెప్పారు. రాత్రంతా స్టేషన్‌లో ఉన్న ప్రధాన నిందితుడు సయ్యద్‌ మహ్మద్‌ ముజఫర్‌ అలీ బుధవారం తెల్లవారు జామున మూత్రవిసర్జనకు వెళ్తున్నా అని చెప్పి స్టేషన్‌ ప్రహరీ దూకి పారిపోయాడు.

వివరాల్లోకి వెళ్తే.. అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 258 సమీపంలో నివసించే డ్రగ్స్‌ విక్రేత సయ్యద్‌ మహ్మద్‌ ముజఫర్‌ అలీ పుప్పాలగూడలోని ఓయో హోటల్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో దాడి చేసి అరెస్టు చేశారు. అతనిచ్చిన సమాచారం మేరకు హష్‌ఆయిల్‌ విక్రేతలైన బుద్వేల్‌కు చెందిన రహీమున్నీసా, సయ్యద్‌ మహ్మద్‌ మజహర్‌ అలీలనూ అరెస్టు చేశారు.

వీరిని రాత్రి పది గంటలకు ఈగల్‌ టీం బృందం నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో ముజఫర్‌ అలీ మూత్రం వస్తుందని చెప్పగా.. అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ పక్కనే ఉన్న మూత్రశాలకు తీసుకెళ్లాడు. ఇంతలోనే ముజఫర్‌ అలీ బయటకు పరుగు తీశాడు. స్టేషన్‌ వెనుక.. మూసీ నది వైపు ఉన్న ప్రహరీని సునాయాసంగా ఎక్కి అవతలకు దూకి పరారయ్యాడు. స్టేషన్‌ సిబ్బంది తేరుకునే లోపే నిందితుడు అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకుని సైబరాబాద్‌ అడిషనల్‌ డీసీపీ ఉదయ్‌రెడ్డి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని సమీక్షించారు.

నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా తప్పించుకున్న నిందితుడు ఓ క్యాబ్‌లో అత్తాపూర్‌ సమీపంలోని లెనిన్‌నగర్‌ వరకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. సదరు క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. నిందితుడు పరారైంది వాస్తవమేనని, అతన్ని అరెస్టు చేసేందుకు ఈగల్‌టీంతో పాటు తమ బృందం గాలిస్తుందని నార్సింగి ఇన్‌స్పెక్టర్‌ హరికృష్ణారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement