హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ నెల 11వ తేదీన జరగనుండగా 97 మంది ఓటర్లు ముందస్తుగానే మంగళవారం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హోం ఓటింగ్‌కు 103 మంది దరఖాస్తు చేసుకోగా, ఈ నెల 4, 6వ తేదీల్లో రెండు విడతలుగా హోం ఓటింగ్ జరిపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. మంగళవారం భారీ పోలీసు బందోబస్తు మధ్య 97 మంది ఓటర్లు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం 7 గంటలకే హోం ఓటింగ్ జరిపే నివాసాల వద్ద పోలింగ్ బూత్ ఎలా ఉండాలో అలాంటి సౌకర్యాలన్నీ కల్పించారు. స్థానిక పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇంటి వద్ద సాయుధ బలగాలను మోహరించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి రజనీకాంత్‌రెడ్డితో పాటు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు పర్యవేక్షించారు. మిగతా వారు ఈ నెల 6వ తేదీన హోం ఓటింగ్‌లో పాల్గొననున్నారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి.
ఇద్దరు ఓటర్ల మృతి..
హోం ఓటింగ్‌లో పాల్గొనేందుకు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 80 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్‌లో ఇద్దరు ఓటింగ్‌కు ముందే మృతి చెందారు. మంగళవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లగా మూడు రోజుల క్రితం ఒకరు, వారం రోజుల క్రితం మరొకరు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. హోం ఓటింగ్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఓటింగ్‌లో పాల్గొనకుండానే వీరు మృతి చెందడం పట్ల అధికారులు కూడా కొంత ఆవేదనకు గురయ్యారు.


