సీఎంఎస్ బ్యాంకు వ్యాన్ నుంచి రూ.7 కోట్లు దోపిడీ
గత బుధవారం చోటు చేసుకున్న ఈ ఘరానా నేరం
నగరానికి వచి్చన ముగ్గురు ప్రధాన సూత్రధారులు
సిటీ పోలీసుల సహకారంతో శనివారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులో ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నింపే వ్యాన్ నుంచి రూ.7.1 కోట్లు కాజేసిన ముఠాలో ముగ్గురు నిందితులు హైదరాబాద్‌లోనే పట్టుబడ్డారు. అక్కడ చిక్కిన దుండగులు ఇచి్చన సమాచారం మేరకు శనివారం హైదరాబాద్ వచ్చిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు సిటీ పోలీసుల సహకారంతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ త్రయం నుంచి రూ.53 లక్షలు రికవరీ చేసిన పోలీసులు బెంగళూరు తరలించారు.
బెంగళూరులోని వివిధ బ్యాంకుల ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని సీఎంఎస్ క్యాష్ మేనేజ్‌మెంట్ సరీ్వసెస్ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన నగదు వ్యాన్‌ను దోచుకోవాలని ఆ సంస్థ మాజీ ఉద్యోగి ఎగ్జావియర్, అక్కడి గోవిందాపురం పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆనందప్ప నాయక్ కుట్ర పన్నారు. దీన్ని అమలు చేయడానికి ఆనందప్ప తనతో పరిచయం ఉన్న సీఎంఎస్ ఉద్యోగి గోపాల్ ప్రసాద్‌తో పాటు అతడి స్నేహితులు నవీన్, నెల్సన్, రవిలను రంగంలోకి దింపాడు. మిగిలిన ముగ్గురూ తెర వెనుకే ఉన్నప్పటికీ..నవీన్, నెల్సన్, రవి త్రయం ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు దోపిడీలో కీలకంగా వ్యవహరించారు.
పోలీసులమంటూ నమ్మబలికి...
సీఎంఎస్ ఆఫీస్ నుంచి నగదు వ్యాన్లను వెంబడించిన ఈ ముగ్గురూ దోచుకోవడానికి సరైన సమయం కోసం వేచి ఉన్నారు. చివరకు గత బుధవారం రంగంలోకి దిగి అక్కడి డెయిరీ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. తాము పోలీసులమంటూ నమ్మబలికి ఆ వ్యాన్‌లో ఉన్న రూ.7.1 కోట్లు తీసుకుని ఉడాయించారు. ఈ ఉదంతంపై సంస్థ ఉద్యోగులు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణం రంగంలోకి దిగిన బెంగళూరు సీసీబీ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ కేసును ఛేదించింది. శుక్రవారం ఎగ్జావియర్, ఆనందప్ప నాయక్‌లను పట్టుకున్నారు. వీరి విచారణలో దోపిడీ చేసిన ముగ్గురూ కారులో హైదరాబాద్ వెళ్లినట్లు, ఖర్చుల కోసం రూ.55 లక్షలు తీసుకువెళ్లినట్లు బయటపడింది. దీంతో ఓ ప్రత్యేక బృందం హుటాహుటిన ఇక్కడకు వచ్చింది .
ఈ ముగ్గురినీ పట్టుకోవడానికి హైదరాబాద్ పోలీసుల సహకారం కోరారు. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఓ టీమ్‌ను రంగంలోకి దింపారు. ఈ బృందం బెంగళూరు అధికారుల సాయంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను సేకరించి విశ్లేషించింది. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురూ బెంగళూరు నుంచి కారులో నాంపల్లి వచ్చారని, అక్కడి ఓ లాడ్జిలో బస చేశారని తేలింది. దీంతో వారిని అదుపులోకి తీసుకోవడానికి ఆ లాడ్జిలో సంయుక్త బృందం దాడి చేసింది. అప్పటికే ఆ త్రయం లాడ్జి ఖాళీ చేసినట్లు తేలడంతో అప్రమత్తమైన ఈ టీమ్ నాలుగుగా విడిపోయింది. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్ స్టేషన్‌తో పాటు నాంపల్లి రైల్వే స్టేషన్‌లోనూ తనిఖీలు చేసింది. రైలులో ముంబై వెళ్లడానికి టిక్కెట్లు ఖరీదు చేసి, ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉన్న ముగ్గురూ ఈ టీమ్‌కు చిక్కారు. వీరి నుంచి రూ.53 లక్షలు రికవరీ చేసిన అధికారులు బెంగళూరు సీసీబీ టీమ్‌కు అప్పగించారు. వీరిని బెంగళూరు తరలించిన ఆ అధికారులు పరారీలో ఉన్న మరో నిందితుడు గోపాల్ ప్రసాద్‌ను అరెస్టు చేశారు.


