రూ.3 కోట్లకుపైగా వసూళ్లు
ఇబ్రహీంపట్నం రూరల్: డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని కొందరు 4 వేల మంది నుంచి రూ.3 కోట్లకు పైగా వసూళ్లు చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. బాలాపూర్ మండలం కుర్మల్‌గూడ ఇంద్రానగర్‌కు చెందిన కళ్లెం అంజయ్య, సునీల్‌కుమార్ మూడేళ్లుగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.6 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారు.
డబ్బులు తీసుకోవడమే కాకుండా దొంగ గెజిటెడ్ సంతకాలు, రెవెన్యూ స్టాంపులతో నకిలీ పత్రాలు ఇచ్చారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలువురి నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారు. తర్వాత ముఖం చాటేయడంతో ఆదివారం 35 మంది బాధితులు ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేశామని సీఐ రవికుమార్ తెలిపారు.


