రైతులు, మహిళలు, యువత అభివృద్ధే లక్ష్యం
‘తెలంగాణ రైజింగ్: విజన్–2047’రూపకల్పన
16 మంది ప్రముఖులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు
సభ్యులుగా నోబెల్ గ్రహీతలు, ఆర్బీఐ మాజీ గవర్నర్లు, సీనియర్ ఐఏఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పాతికేళ్ల అవసరాలను తీర్చేలా తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్: విజన్–2047’ను రూపొందిస్తోంది. రైతులు, మహిళలు, యువతను లక్ష్యంగా చేసుకొని విధానాలను పొందుపర్చనుంది. ఇందులో ప్రజా విధానం, పాలన, ఆర్థిక శాస్త్రం, పర్యావరణం, పరిశ్రమ, సాంకేతికత, విద్య, పౌర సమాజం వంటి విభిన్న రంగాల నుంచి నిపుణులను భాగస్వామ్యం చేసింది. ఈమేరకు పాలసీ రూపకర్తలు, ఆర్థికవేత్తలు, నోబెల్ గ్రహీతలు, సీనియర్ ఐఏఎస్‌లు, మాజీ ఆర్బీఐ మాజీ గవర్నర్లతో కూడిన 16 మంది సభ్యులతో ప్రత్యేకంగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి పాలన, సమ్మిళిత అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక.. ‘తెలంగాణ రైజింగ్: విజన్–2047’పేరిట దీర్ఘకాలిక అభివృద్ధి చొరవను ప్రారంభించింది. రాబోయే 25 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి, అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇందులో సమగ్ర ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, పౌరులందరికీ సమాన అవకాశాలను సాధించడం అనేవి లక్ష్యాలుగా ఉంటాయి. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే విజన్ డాక్యుమెంట్ ప్రధాన లక్ష్యం.
అడ్వైజరీ కమిటీ ఏం చేస్తుందంటే..
‘తెలంగాణ రైజింగ్: విజన్–2047’డాక్యుమెంట్ రూపకల్పన, వ్యూహాత్మక పర్యవేక్షణ, వ్యూహాత్మక దిశానిర్దేశం చేయడమే ఈ అడ్వైజరీ కమిటీ ఉద్దేశం. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి దేశ, విదేశాల నుంచి ఉత్తమ పద్ధతులు, విజయవంతమైన నమూనాలను సిఫార్సు చేస్తుంది. ఆర్థిక ప్రణాళిక, స్థిరత్వం, సామాజిక సాధికారత, పాలన, ఆవిష్కరణలతో సహా కీలక రంగాలలో పురోగతిని సమీక్షించేందుకు ఈ కమిటీ క్రమం తప్పకుండా వర్చువల్‌గా సమావేశమవుతుంది. అవసరమైతే మార్గనిర్దేశం చేయడానికి ఈ సలహా మండలి ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్‌లో కాకుండా వేర్వేరు ప్రదేశాలలో సమావేశమవుతుంది.
అడ్వైజరీ కమిటీ సమావేశాలు, డాక్యుమెంటేషన్, ఫాలోఅప్‌లను సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రణాళిక విభాగం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. సలహా మండలికి స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (స్పీడ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనీ్వనర్‌గా వ్యవహరిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9న జరగనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు సలహా మండలి సభ్యులందరూ హాజరుకానున్నారు.
అడ్వైజరీ కమిటీ సభ్యులు వీళ్లే..
⇒ ప్రొ.అభిజిత్ బెనర్జీ, ఆర్థికశాస్త్రం (2019)లో నోబెల్ అవార్డ్ గ్రహీత
⇒ కిరణ్ మజుందర్ షా, పద్మభూషణ్ అవార్డు గ్రహీత
⇒బెజవాడ విల్సన్, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత
⇒ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్
⇒ డాక్టర్ రఘురాం రాజన్, ఆర్బీఐ మాజీ గవర్నర్
⇒ శాంతను నారాయణ్, అడోబ్ సీఈఓ
⇒ అరుణా రాయ్, మాజీ ఐఏఎస్
⇒ హర్‡్ష మందర్, మాజీ ఐఏఎస్
⇒ డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్, మాజీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్
⇒ క్రిస్ గోపాలకృష్ణన్, సీఐఐ మాజీ ప్రెసిడెంట్
⇒ డాక్టర్ రుక్మిణి బెనర్జీ, ప్రథం సీఈఓ
⇒ ప్రొ. జయతి ఘోష్, యూఎన్ హైలెవల్ అడ్వైజరీ బోర్డ్ సభ్యురాలు
⇒ డాక్టర్ సంతోష్ మెహరోత్రా, ఆర్థికవేత్త, పబ్లిక్ పాలసీ నిపుణులు
⇒ ప్రొ. హిమాన్షు, ప్రముఖ ఆర్థికవేత్త
⇒ డాక్టర్ అరుణభ ఘోష్, క్‌లైమేట్ పాలసీ నిపుణులు
⇒మోహన్ గురుస్వామి, ప్రముఖ ఇండియన్ పాలసీ విశ్లేషకులు, కాలమిస్ట్


