సీట్లు లభించక వయోధికులు, పురుషుల అవస్థలు
ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో తీవ్ర ఇబ్బందులు
సిటీ బస్సుల్లో రోజుకు 26 లక్షల మంది ప్రయాణం
వీరిలో 18.5 లక్షల మందికిపైగా మహిళలే
కేవలం 7.5 లక్షల మంది మాత్రమే పురుషులు
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సెక్కేందుకు సీనియర్ సిటిజన్‌లు వణుకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మహిళా ప్రయాణికుల రద్దీ కారణంగా మగవాళ్లకు సీట్లు లభించడం లేదు. దీంతో వయోధికులైన ప్రయాణికులు, దివ్యాంగులు బస్సులో నిల్చునే ప్రయాణం చేయాల్సి వస్తోంది. సీట్ల కొరత కారణంగా ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. సీనియర్‌ల కోసం కేటాయించిన సీట్లలో మహిళలు కూర్చోవడంతో వారిని ఆ సీటు ఖాళీ చేయాలని చెప్పేందుకు కండక్టర్లు సైతం సాహసించలేకపోతున్నారు. దీంతో సీనియర్‌లు నిస్సహాయ స్థితిలో నిల్చుని ప్రయాణం చేస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు సందర్భాల్లో చాలా ఇబ్బందిగా ఉందని వయోధికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాస ప్రయాణం..
‘శామీర్‌పేట్ నుంచి సికింద్రాబాద్‌కు వచి్చనప్పుడల్లా స్టాండింగ్ జర్నీ తప్పడం లేదు. ఒకవైపు మోకాళ్ల నొప్పులు, మరోవైపు నిలబడి ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది’ అని శామీర్‌పేట్‌కు చెందిన సత్తిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మహిళల ఉచిత ప్రయాణానికి ఏ మాత్రం వ్యతిరేకం కా దని, కనీసం పెద్దవాళ్లను గౌరవించే సంప్రదాయం కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ సిటీజన్‌లకే కాకుండా లాంగ్ జర్నీ రూట్‌లలో మగవారికీ స్టాండింగ్ కష్టంగానే మారింది.
డిమాండ్ మేర బస్సులు లేక..
ఇబ్రహీంపట్నం– సికింద్రాబాద్, లింగంపల్లి– సికింద్రాబాద్, కోఠి– పటాన్‌చెరు, ఉప్పల్–కొండాపూర్, ఉప్పల్– మెహిదీపట్నం, ఘట్కేసర్– సికింద్రాబాద్, శామీర్‌పేట్– సికింద్రాబాద్, హయత్‌నగర్–కోఠి తదితర మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువ. ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం నగర శివార్ల నుంచి మహిళా ప్రయాణికులు భారీ ఎత్తున రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకురద్దీ రూట్లలో బస్సులన్సీ మహిళా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. అదే బస్సుల్లో ప్రయాణం చేయడం పురుషులకు నరకప్రాయంగా మారింది. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడం కూడా ప్రధాన కారణం.
బస్సుల్లో 60 శాతం ఓపెన్..
సిటీబస్సుల సీట్ల కేటాయింపులో ఆర్టీసీ రిజర్వేషన్‌లను పాటిస్తోంది. సాధారణంగా అన్ని బస్సుల్లో మహిళలకు 40 శాతం సీట్లను కేటాయించారు. ఆ సీట్లలో వారు మాత్రమే కూర్చోవాలి. మిగతా 60 శాతం సీట్లు అందరికీ వర్తిస్తాయి. పురుషులతో పాటు మహిళలు కూడా ఈ ఓపెన్ కేటగిరీ సీట్లను వినియోగించుకోవచ్చు. మరోవైపు ఈ 60 శాతంలోనే సీనియర్ సిటిజన్‌లకు, దివ్యాంగులకు రెండు సీట్లను కేటాయించారు.
మహాలక్ష్మి పథకానికి ముందు ఈ సీట్ల కేటాయింపుతో పురుషులకు ఎక్కువ సంఖ్యలో సీట్లు లభించేవి. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కొనసాగించారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచి్చన తర్వాతే మహిళల సంఖ్య గణనీయంగా పెరగడం, వివిధ రూట్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో సీట్ల కొరత పెద్ద సవాల్‌గా మారింది. రద్దీ వేళల్లో ఓపెన్ కేటగిరీలోని 60 శాతం సీట్లలో కనీసం సగానికి పైగా మహిళలే వినియోగించుకోవడం గమనార్హం.
పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం
గ్రేటర్‌లో 25 డిపోల నుంచి ప్రతి రోజు సుమారు 2,850 బస్సులు నడుస్తున్నాయి. రెండేళ్ల క్రితం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి వీరి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజు మొత్తం 26 లక్షల మంది సిటీ ఆర్టీసీ బస్సులో పయనిస్తుండగా.. వీరిలో 18.5 లక్షల మంది మహిళలు, 7.5 లక్షల మంది పురుషులు ఉన్నారు.


