
హైదరాబాద్: అభమూ శుభమూ తెలియని ఐదేళ్ల బాలుడిపై ఓ మానవ మృగం లైంగిక దాడికి పాల్పడి.. అనంతరం హత్య చేసిన దారుణ ఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. రామంతాపూర్ కేసీఆర్ నగర్‌లో నివసించే ఓ వ్యక్తి స్థానికంగా ఉన్న టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ నెల 12న తన కుమారుడు (5) కనిపించడం లేదంటూ ఉప్పల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపిన పోలీసులు.. సీసీ ఫుటేజీల ఆధారంగా అనుమానితుణ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అసలు విషయం బయట పడింది. అదే టింబర్ డిపోలో పని చేసే కమర్ అనే వ్యక్తి 12వ తేదీన బాలుడికి మాయమాటలు చెప్పి కేసీఆర్ నగర్ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దీంతో బాలుడు స్పృహ తప్పిపోగా.. గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించాడు. బిహార్‌కు చెందిన కమర్.. బాలుడి ఇంటి పక్కనే నివాసం ఉండేవాడని పోలీసులు తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు చెప్పారు.