
డాక్టర్ నమ్రత ఏజెంట్లనెట్‌వర్క్‌కు మూలాలు ఇవే
చట్టం నుంచి తప్పించుకోవడానికే వేర్వేరు చోట్ల దందా.. ‘సృష్టి’పై ఇప్పటివరకు 9 కేసులు నమోదు
డాక్టర్లు, నర్సులు,ఏజెంట్లు సహా 25 మంది అరెస్టు
తదుపరి దర్యాప్తు నిమిత్తం కేసు సిట్‌కు బదిలీ: డీసీపీ సాధన
సాక్షి, హైదరాబాద్: సరోగసీ పేరుతో శిశువుల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడిన యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసును నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత ఏజెంట్ల నెట్‌వర్క్‌ను నార్త్‌జోన్ పోలీసులు ఛేదించారు. ఈ నెట్‌వర్క్‌కు క్లినికల్ ట్రయల్స్ చేసే క్యాంపులతోపాటు అండాన్ని డొనేట్ చేసే మహిళలే మూలమని గుర్తించారు. డాక్టర్ నమ్రతపై గతంలో 15 కేసులు ఉండగా, తాజాగా 9 కేసులు నమోదైనట్లు డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు.
ఈ కేసుల్లో ఇప్పటివరకు 25 మంది నిందితులను అరెస్టు చేశామని, వీరిలో డాక్టర్లు, నర్సులు, ఏజెంట్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏసీపీ పి.సుబ్బయ్యతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, కొండాపూర్‌లతో పాటు విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, భువనేశ్వర్, కోల్‌కతాలో సెంటర్లు నిర్వహిస్తున్న నమ్రత.. దేశవ్యాప్తంగా ఏజెంట్ల నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుందని తెలిపారు.
ఆ క్యాంపుల్లో ఏర్పడిన పరిచయాలతోనే...
వివిధ ఔషధాలు, నూతన వైద్య విధానాలపై అధికా రికంగానే క్లినికల్ ట్రయల్స్ జరుగుతుంటాయి. ఇలాంటి క్యాంపులకు వెళ్లే నమ్రత లేదా ఆమె ఉద్యోగులు పురుష వలంటీర్లను ట్రాప్ చేసి ఏజెంట్లుగా మార్చుకున్నారు. అలాగే ఐవీఎఫ్ కేంద్రాల్లో అండం (ఎగ్) డొనేషన్ కోసం వచ్చిన మహిళల్ని తమ దారిలోకి తెచ్చుకుంటున్నారు. వీరిని ఏజెంట్లు గా చేసుకుంటున్నారు. నమ్రతకు ప్రధాన ఏజెంట్‌గా వ్యవహరించిన ధనశ్రీ సంతోషి వివిధ ప్రాంతాల్లో సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. వీరి ద్వారానే పేద గర్భిణులను గుర్తించి నమ్రత వాడుకుంది.
నకిలీ డీఎన్‌ఏ రిపోర్టులు సృష్టించి...
ఐవీఎఫ్ కోసం సికింద్రాబా ద్‌లోని సృష్టి సెంటర్‌కు వచ్చే దంపతుల్లో ఖర్చు పెట్టగలిగేవారిని సరో గసీ వైపు మళ్లించే నమ్రత..వారిని విశాఖపట్నం పంపించి పరీక్షలు చేయించేది. వారి అండం, వీర్యంతోనే సరోగసీ జరుగుతున్నట్లు నమ్మించి.. డెలివరీ సమయానికి ఒప్పందం చేసుకున్న పేద గర్భిణులను తీసుకువచ్చి డెలివరీ చేయించి, ఆ శిశువు సరోగసీ ఒప్పందం చేసుకున్న దంపతులకే పుట్టినట్లు నమ్మించి అప్పగించేది. కన్న తల్లిదండ్రులకు నామమాత్రపు మొత్తం చెల్లిస్తూ శిశువును దత్తత ఇస్తున్నట్లు చెప్పేది.
ఇందుకోసం నకిలీ డీఎన్‌ఏ రిపోర్టులు సృష్టించేది. ఈ శిశువుల జనన రిజిస్ట్రేషన్ తదితరాలన్నీ విశాఖలోనే నిర్వహించేవారు. బాధితుల నుంచి నమ్రత రూ.1.6 కోట్లు వసూలు చేసిందని పోలీసులు గుర్తించారు. సరోగసీ పేరుతో ముగ్గురు శిశువుల్ని విక్రయించిన నమ్రత.. మరో కేసులో మాత్రం డెలివరీ సమయంలో శిశువు చనిపోయినట్లు నమ్మించి ఏమాత్రం సంబంధం లేని మృత శిశువును చూపించింది.
మరోసారి సరోగసీ చేయాలంటే అదనంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసింది. ఈ కేసులో మొత్తం 25 మంది అరెస్టు చేశారు. వీరిలో వైద్యులైన నమ్రత, సదానందం, విద్యుల్లత, ఉషా దేవి, రవిపై ఉన్న 9 కేసుల దర్యాప్తును సీసీఎస్ అధీనంలోని సిట్ బదిలీ చేశారు.