
ఐదు రోజుల వ్యవధిలో ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరి బలవన్మరణం
రెండు కుటుంబాల్లో చర్చనీయాంశంగా మారిన విషాదకర ఘటనలు
మియాపూర్: పదో తరగతి విద్యారి్థని భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నింపింది. సీఐ శివప్రసాద్, మృతురాలి తండ్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లోని డీ– బ్లాక్‌లో నాలుగో అంతస్తులో నివాసముంటున్న బిజయ్ నాయక్, చిన్మయి నాయక్ దంపతులకు కుమార్తె హన్సిక నాయక్ (15), ఓ కుమారుడు ఉన్నారు. హన్సిక మియాపూర్ మాధవ నగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. గురువారం ఉదయం హన్సిక పరీక్ష రాసేందుకు వెళ్లగా.. పాఠశాల యాజమాన్యం ఇంటికి తిరిగి పంపించింది. దీంతో హన్సిక ఇంటికి వెళ్లి మధ్యాహ్నం తాము నివసిస్తున్న భవనం ఐదో అంతస్తు పైనుంచి కిందికి దూకడంతో తీవ్ర గాయాలపాలైంది. ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఐదు రోజుల క్రితం..
మాధవనగర్‌లోని హన్సిక చదువుతున్న పాఠశాలలోనే పదో తరగతి చదువుతున్న షేక్ రిజ్వాన్ (15) ఈ నెల 19న పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రిజ్వాన్, హన్సిక ఒకే తరగతి కావడంతో సన్నిహితంగా మెలిగేవారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేసుకునేవారు. వీటిని పాఠశాల టీచర్ చూసి ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించింది. దీంతో ప్రిన్సిపాల్ రిజ్వాన్ తల్లిని పాఠశాలకు శనివారం పిలిపించి మాట్లాడుతుండగా ఈ చాటింగ్ విషయం తల్లికి, పాఠశాల యాజమాన్యానికి తెలిసిందనే మనస్తాపంతో పాఠశాల భవనం ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలో గురువారం విద్యార్థిని హన్సిక, తండ్రి బిజయ్ నాయక్‌తో కలిసి మృతి చెందిన తోటి విద్యార్థి రిజ్వాన్ ఇంటికి వెళ్లారు. అక్కడ రిజ్వాన్ తల్లిదండ్రులు బిజయ్ నాయక్, హన్సికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల భవనంపై నుంచి దూకి రిజ్వాన్ ఆత్మహత్య చేసుకున్న విధంగానే తన కుమార్తె హన్సికను పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని బెదిరించారని హన్సిక తండ్రి బిజయ్ నాయక్ పోలీసులకు చెప్పారు. పరీక్ష రాసేందుకు అనుమతించకపోవడం, తోటి విద్యార్థి రిజ్వాన్ కుటుంబ సభ్యులు దూషించడంతో మనస్తాపం చెందిన తన కుమార్తె హన్సిక ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని మియాపూర్ పోలీసులు తెలిపారు.