వంద రోజుల్లో గంజాయి, డ్రగ్స్ అరికడతామని ఎన్నికల్లో చంద్రబాబు బృందం ప్రగల్భాలు
కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ
డ్రగ్స్ వద్దు బ్రో..! అంటూ లోకేశ్ చిలక పలుకులు
కానీ డ్రగ్స్ బ్యాచ్ అంతా ఎల్లో గ్యాంగే..
మాదకద్రవ్యాల బానిసలను అరెస్టు చేయాలన్న పవన్ కళ్యాణ్
టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్స్ బాగోతంపై మాత్రం మౌనం
గంజాయి, డ్రగ్స్ మాఫియా డాన్‌లు కూటమి నేతలే
డ్రగ్స్ మాఫియాకు కూటమి ప్రభుత్వం రాచబాట
రాష్ట్రంలో ఏటా రూ.వేల కోట్ల దందా
ఊరూవాడా నకిలీ మద్యం ప్రవాహం
కుటీర పరిశ్రమ తరహాలో తయారీ
ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం తన పేటెంట్ హక్కని చంద్రబాబు మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన లోకేశ్ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. డ్రగ్స్ బ్యాచ్‌కు వత్తాసు పలుకుతూ ప్రజలను మోసగిస్తున్నారు. మాదక ద్రవ్యాల బానిసలను అరెస్టు చేయాలని ఎన్నికల ముందు వేదికల మీద వీరావేశంతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. టీడీపీ కూటమి గంజాయి దందాపై మాత్రం ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోతున్నారు.
వెరసి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. రాష్ట్రాన్ని టీడీపీ డ్రగ్స్ మాఫియాకు అప్పగించేసి తన మార్కు మోసాన్ని పునరావృతం చేశారు. దీంతో మాయల ఫకీరు మాయమాటలు నమ్మి మోసపోయిన బాలనాగమ్మలా తయారైంది రాష్ట్రం పరిస్థితి. టీడీపీ కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో డ్రగ్స్, గంజాయి రాజధానిగా ముద్ర వేసుకుని జాతీయ స్థాయిలో చెడ్డపేరు తెచ్చుకుంటోంది. -సాక్షి, అమరావతి
నాడు
ప్రజల్ని మభ్య పెట్టేందుకే విష ప్రచారం..
చంద్రబాబు బృందం పన్నాగం
తాము అధికారంలోకి వస్తే చాలు డ్రగ్స్, గంజాయిలను అరికడతామన్న చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ మాటలు ఎన్నికల ముందు కోటలు దాటాయి. నాడూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేసేందుకు గంజాయి, డ్రగ్స్ దందా పెరిగిపోయిందంటూ ఊరూవాడా దుష్ప్రచారానికి తెర తీశారు. అందుకు టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా వత్తాసు పలికింది. కారు కూతలు, కాకి లెక్కలతో ప్రజల్ని తప్పుదారి పట్టించాయి. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి దందాను ఉక్కుపాదంతో అణచివేసింది.

అందుకోసమే స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్) అనే వ్యవస్థను ప్రత్యేకంగా నెలకొల్పి విస్తృత అధికారాలు కల్పించింది. ‘సెబ్’ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో(ఏవోబీ)లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగును కూకటి వేళ్లతో పెకిలించి వేసింది. ఆపరేషన్ పరివర్తన్‌ను రెండు దశల్లో విజయవంతంగా నిర్వహించి 11,500 ఎకరాల్లో గంజాయి సాగును నిర్మూలించింది.
దశాబ్దాలుగా గంజాయి సాగును జీవనాధారంగా చేసుకున్న గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా ప్రోత్సహించింది. తద్వారా ఏవోబీలో గంజాయి సాగు అన్నదే లేకుండా చేసింది. అయినా సరే.. చంద్రబాబు, లోకేశ్ రాజకీయ దురుద్దేశాలతో నాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే చాలు వంద రోజుల్లోనే గంజాయి, డ్రగ్స్ అనేవే లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు.

ఈ దుష్ప్రచార కుట్రలో చంద్రబాబు పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్ పాలు పంచుకుని మరింత దిగజారుడు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఏకంగా 34 వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయారని... ఈమేరకు కేంద్ర నిఘా వర్గాలు తనకు తెలిపాయంటూ దుష్ప్రచారం చేశారు. అందుకు గంజాయి బ్యాచ్‌లే కారణమని ఆరోపణలు చేశారు. ఇలా చంద్రబాబు ముఠా ఎన్నికల్లో ప్రజల్ని తప్పుదారి పట్టించడమే లక్ష్యంగా
పక్కా పన్నాగంతో దుష్ప్రచారానికి బరి తెగించింది.
నాడు దుష్ప్రచార రాద్ధాంతం.. నేడు డ్రగ్స్ దందాపై మౌనమే సిద్ధాంతం
ఇదీ పవన్ కళ్యాణ్ తీరు
రాష్ట్రంలో 34 వేల మంది బాలికలు కనిపించకుండా పోయారని గతంలో విష ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తాను ఉప ముఖ్యమంత్రి కాగానే ఆ మాటే ఎత్తడం లేదు. మరి ఆ బాలికలను సురక్షితంగా వారి కుటుంబాల దగ్గరకు చేర్చేందుకు ఏ చర్యలు తీసుకున్నారంటే సమాధానమే చెప్పడం లేదు. ఎందుకంటే.. వైఎస్సార్‌సీపీ హయాంలో బాలికలు కనిపించకుండా పోయారని తాను చేసింది తప్పుడుప్రచారమేనన్న నిజం ఆయనకు తెలుసు కాబట్టే!

నాడు చంద్రబాబు కుట్ర స్క్రిప్ట్ ప్రకారమే అవాస్తవ ఆరోపణలతో పవన్ నటించారన్నది స్పష్టమైంది. ఇక ప్రస్తుతం టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ తీసుకున్నారని వెల్లడైనా సరే పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. కూటమి ప్రభుత్వంలో ఈ 20 నెలల్లోనే 280 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగినా.. వారిలో 15 మందిపై హత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చినా పవన్ కళ్యాణ్ కనీసం స్పందించలేదు. ఎందుకంటే.. ఈసారి చంద్రబాబు ఆయనకు స్క్రిప్ట్ ఇవ్వలేదు కదా!
నేడు
డ్రగ్స్ దందాకు రాచబాట
మత్తు మందుల రాజధానిగా ఏపీ
టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు తన నిజ స్వరూపం ప్రదర్శించారు. టీడీపీ గంజాయి, డ్రగ్స్ మాఫియాకు తలుపులు బార్లా తెరిచారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అణచివేసిన గంజాయి దందాను మళ్లీ తెరపైకి తెచ్చారు. చంద్రబాబుకు వీరవిధేయులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలే రింగ్ మాస్టర్లుగా డ్రగ్స్ దందాకు బరి తెగించారు. ఏవోబీలో గంజాయి సాగును మళ్లీ పట్టాలు ఎక్కించడంతోపాటు.. ఒడిశా, చత్తీస్‌ఘడ్ నుంచి గంజాయి స్మగ్లింగ్‌కు ఏపీని గేట్‌వేగా మార్చేశారు.

ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలను తమ గంజాయి దందాకు మార్కెట్‌గా చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇస్తే చాలు డోర్ డెలివరీ... ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీలంటే చాలు బల్‌్కగా సరఫరా... విద్యా సంస్థలే లక్ష్యంగా రిటైల్ అమ్మకాలు...! ఇలా వివిధ రీతుల్లో గంజాయి, డ్రగ్స్ మార్కెటింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇక ద్రవరూప గంజాయి (లిక్విడ్ గంజాయి) మాఫియా అయితే అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. సాధారణ గంజాయి కిలో రూ.12 వేలు ఉంటే... లిక్విడ్ గంజాయి లీటరు రూ.లక్ష ధర పలుకుతుండటమే అందుకు కారణం.

ప్రజల్ని మభ్యపెట్టేందుకే ‘గంజాయి వద్దు బ్రో..’ అనే నినాదాలతో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ టీడీపీ గంజాయి మాఫియా దర్జాగా దందా సాగిస్తున్నా కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఏటా రాష్ట్రం గుండా రూ.600 కోట్ల విలువైన 5 లక్షల కిలోల గంజాయి దందా సాగుతోందని పోలీసు వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇక అప్ఘనిస్తాన్, నేపాల్ నుంచి తెప్పిస్తున్న కొకైన్ లాంటి డ్రగ్స్ దందా మరో రూ.500 కోట్లు ఉంటుందని చెబుతున్నాయి. దాంతోపాటు టీడీపీ మద్యం మాఫియా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాను ఏకంగా కుటీర పరిశ్రమ తరహాలో ఊరూవాడా నెలకొల్పి దోపిడీకి పాల్పడుతోంది. ఏటా రూ.5 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 వేల కోట్ల దోపిడీయే లక్ష్యంగా దందా సాగిస్తోంది.
‘దమ్మారో... దమ్’ అంటున్న కూటమి నేతలు
మరోవైపు టీడీపీ కూటమి నేతలు దమ్మారో దమ్..! అంటూ డ్రగ్స్, గంజాయి మత్తులో జోగుతున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుదీర్‌రెడ్డి డ్రగ్స్ మత్తులో జోగుతూ ఇటీవల పోలీసులకు చిక్కారు. గతేడాది భీమవరం ఎమ్మెల్యే పి.రామాంజనేయులు కుమారుడు కూడా హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో చిక్కారని జాతీయ మీడియాలో ప్రముఖంగా ప్రచురితం కావడం గమనార్హం.
తాజాగా ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ హైదరాబాద్‌లో డ్రగ్స్ సేవించి అడ్డంగా దొరికారు. అయినా సరే కేవలం షోకాజ్ నోటీసుతో చంద్రబాబు సరిపుచ్చారు. తమ అధినేత అండ చూసుకునే ఎంపీ పుట్టా మహేశ్ సోమవారం లోక్‌సభ సమావేశాలకు దర్జాగా హాజరయ్యారని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.


