
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించిన హెచ్‌సీఏ.. ప్రతీ క్యాంప్‌లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.
ఒక్కో క్యాంప్‌పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్‌మోహన్‌రావు కాజేశారు. క్యాంప్‌కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్‌లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్‌లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.
కాగా, హెచ్‌సీఏ కేసులో ముగ్గురికి బెయిల్ మంజూరైంది. హచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్‌రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్‌మోహన్‌రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్‌మోహన్‌రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్‌లపై వాదనలు జరగనున్నాయి.