పశ్చిమ గోదావరి జిల్లా: మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వ్యవస్థలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే గుండె బరువెక్కుతుంది. ఓ వ్యక్తి భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆపై ఆమెకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబు వయసు ఆర్నెల్లు. సదరు వ్యక్తి తన భార్యతో కలిసి అన్నెంపున్నెం ఎరుగని ఆ బాబును రూ.5 లక్షలకు విక్రయించిన ఉదంతం తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
ఎస్‌ఐ మనోహర్ కథనం ప్రకారం.. గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన జొన్నకూటి వీరయ్య, చిన్నారి భార్యాభర్తలు. అయితే అదే మండలంలోని చిట్యాలకు చెందిన చిన్నం జ్యోతికతో కలిసి వీరయ్య కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. చెడు అలవాట్లకు బానిసైన వీరయ్య ఆరి్థకంగా ఇబ్బందులు పడుతున్నాడు. మరోవైపు జ్యోతిక, వీరయ్యకు బాబు పుట్టాడు. ప్రస్తుతం ఆ బాబుకు ఆరు నెలలు కాగా దేవరపల్లికి చెందిన టి.సురేష్ ద్వారా వీరయ్య, అతడి మొదటి భార్య చిన్నారి కలిసి రూ.5 లక్షలకు విక్రయించేందుకు పథకం వేశారు.
ఈ మేరకు ఈ నెల 19న మధ్యవర్తికి ఆ బాబును అప్పగించి, అతడి నుంచి ముందుగా రూ.1.50 లక్షలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న జ్యోతిక పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాబు మధ్యవర్తి వద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆ బాబును తెచ్చి తల్లి జ్యోతికకు అప్పగించారు. వీరయ్య, చిన్నారి దంపతులను మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ మనోహర్ తెలిపారు.


