వికారాబాద్ జిల్లా: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో కులాంతర వివాహానికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులపై కక్ష గట్టింది. అమ్మానాన్న బతికి ఉంటే పెళ్లి చేసుకోనివ్వరని, వారిని చంపితేనే తన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించింది. ఒకరి తర్వాత మరొకరికి అధిక మోతాదు మత్తు మందు ఇంజెక్షన్లు ఇచ్చి హతమార్చింది. సంచలనం సృష్టించిన ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ బుధవారం వివరాలు వెల్లడించారు. బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్కలి లక్ష్మి, దశరథ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడితో పాటు ముగ్గురికి వివాహం కాగా, చిన్నకూతురు సురేఖకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన సురేఖ సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఏడాది క్రితం ఇన్‌స్టాలో పరిచయమైన ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తోంది. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే కులాలు వేరు కావడంతో వారు ఎంతకూ అంగీకరించలేదు. దీంతో తల్లిదండ్రుల హత్యకు సురేఖ కుట్ర పన్నింది.
పథకం ప్రకారం..
తాను పనిచేసే ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే మత్తు కలిగించే అట్రాకూరియం (అర్టాసిల్) 2.5 ఎంఎల్ సీసాలు నాలుగు దొంగిలించింది. ఈ నెల 24న ఆస్పత్రిలో వీక్లీ ఆఫ్ తీసుకుని ఇంటికి బయలుదేరింది. మార్గంమధ్యలో మోమిన్‌పేట మండల కేంద్రంలోని ఓ మెడికల్ షాప్‌లో 3 సిరంజిలు తీసుకుంది. పొలం వెళ్లి రాత్రికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన సురేఖ.. మళ్లీ ఆ యువకుడితో పెళ్లి ప్రస్తావన తెచ్చింది. వారు కుదరదంటే కుదరదన్నారు. దీంతో తన పథకం అమలు చేయాలని సురేఖ నిర్ణయించుకుంది. తల్లి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో.. కీళ్లు, ఒళ్లు నొప్పులు తగ్గేందుకు ఇంజెక్షన్ తెచ్చానని నమ్మబలికి 5 ఎంఎల్ డోస్ ఇవ్వడంతో ఆమె కుప్పకూలిపోగా దుపట్టా కప్పింది. ఆ తర్వాత ఆరు బయట చలిమంట కాచుకున్న తండ్రి లోనికి రాగా, అమ్మకు కీళ్లు, కాళ్ల నొప్పులు తగ్గేందుకు ఇంజెక్షన్ ఇచ్చానని, ఆమె నిద్రపోతోందని, నీకు కూడా ఇంజెక్షన్ తెచ్చానని చెప్పి, అతనికి కూడా 5 ఎంఎల్ అట్రాకూరియం ఇచ్చింది. దీంతో కొద్దిసేపటికే దశరథ్, లక్ష్మి తుదిశ్వాస విడించారు.
సహజ మరణంగా చిత్రీకరించే యత్నం
తన తల్లిదండ్రులవి సహజ మరణాలుగా చిత్రీకరించాలని సురేఖ ఎత్తుగడ వేసింది. తన అన్న అశోక్‌కు ఫోన్ చేసి అమ్మానాన్న చనిపోయారని, తనకు భయమేస్తోందని, త్వరగా రావాలని చెప్పింది. అశోక్ వచ్చాక.. నాన్న తనతో మాట్లాడుతూ అన్నతో మంచిగా ఉండు, అన్న చెప్పినట్లు విను, వాడే అన్నీ చూసుకుంటాడని చెబుతూ పడిపోయాడని చెప్పింది. విషయం అమ్మకు చెప్పడంతో షాక్‌కు గురైన ఆమె స్పృహ తప్పి పడిపోయిందని, సీపీఆర్ చేసినా బతకలేదంటూ విలపించింది.
అనుమానమే నిజమైంది..
అప్పుల బాధ భరించలేక తన తండ్రి విషం తాగి చనిపోయాడని, ఇది చూసిన తన తల్లి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొంటూ అశోక్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు సిరంజిలు గుర్తించారు. వాటికి రక్తం కూడా అంటుకుని ఉండటం గమనించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కొందరు కుటుంబ సభ్యులు సైతం సురేఖపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను విచారించారు. దీంతో ఆమె నేరం అంగీకరించింది. బుధవారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించారు. కేసును మూడు రోజుల్లోనే ఛేదించిన సీఐ రఘురాం, బంట్వారం ఎస్‌ఐ విమలను డీఎస్పీ అభినందించారు.
కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన యువతి
వికారాబాద్ జిల్లా, బంట్వారం మండలం, యాచారంలో జరిగిన దారుణం
సంగారెడ్డిలో నర్సుగా పని చేస్తున్న సురేఖకి ఒక యువకుడితో పరిచయం
ఆ పరిచయం ప్రేమగా మారగా.. పెళ్లి చేసుకోవాలని ప్రేమజంట నిర్ణయం
మరో యువకుడికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించిన సురేఖ… pic.twitter.com/b8gfri2YV7— PulseNewsBreaking (@pulsenewsbreak) January 28, 2026


