ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదం పొగమంచు, వెలుతురు లేమి కారణంగా జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రయాణిస్తున్న విమానం బుధవారం ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ పవార్, విదీప్ జాదవ్,పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శంభవి పాఠక్‌లు ప్రాణాలు కోల్పోయారు
అయితే, ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలెట్ల గురించి నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అజిత్ పవార్ మంగళవారం ఉదయం ముంబై నుంచి లియర్‌జెట్ 45 విమానంలో బయలు దేరారు. అయితే, ఈ విమానం, బరామతి విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ ప్రయత్నం చేస్తుండగా సాంకేతిక సమస్యలు ఎదుర్కొంది. అత్యవసర ల్యాండింగ్ ప్రయత్నంలో విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. విమాన ప్రమాదంలో విమానంలో మొత్తం ఐదుగురు ఉన్నారు అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు, అలాగే పైలట్-ఇన్-కమాండ్ కెప్టెన్ సుమిత్ కపూర్, ఫస్ట్ ఆఫీసర్ కెప్టెన్ శంభవి పాఠక్ అక్కడికక్కడే మరణించారు.

కెప్టెన్ సుమిత్ కపూర్ అనుభవజ్ఞుడైన కమర్షియల్ పైలట్. ఆయనకు బిజినెస్ ఫ్లైట్స్ నడిపిన అనుభవం ఉంది. శంభవి పాఠక్ కూడా శిక్షణ పొందిన కమర్షియల్ పైలట్. గతంలో ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేశారు. ఇద్దరూ వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు పనిచేస్తున్నారు.
విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విమానం ఎందుకు నియంత్రణ కోల్పోయిందో, సాంకేతిక లోపమా లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా అన్నది పరిశీలిస్తున్నారు. బరామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా విమానయాన రంగంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.


