
ఖజానా జ్యువెలరీ షోరూంలోకి తుపాకులతో ప్రవేశిస్తున్న దొంగలు
చందానగర్ ఖజానా జ్యువెలరీస్‌లో భారీ చోరీ..
ఉదయాన్నే షాపు తెరవగానే..తుపాకులతో లోపలికి వచ్చిన బందిపోటు దొంగలు
సిబ్బందిని బెదిరించి.. డిప్యూటీ మేనేజర్ కాలిపై కాల్చిన దుండగులు
అప్పటికి లాకర్‌లోనే ఉన్న బంగారు ఆభరణాలు
బంగారం అని అనుకుని.. గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరార్
మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్ ముఠాగా అనుమానం
సాక్షి, హైదరాబాద్/చందానగర్: హైదరాబాద్ చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షోరూంపై బందిపోటు దొంగలు పంజా విసిరారు. మంగళవారం ఉదయం షాపు తెరిచే సమయంలోనే తుపాకులతో చొరబడిన ముఠా బంగారం కోసం ప్రయత్నించి గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరారయ్యింది. ఈ సందర్భంగా దుండగుల కాల్పుల్లో షోరూమ్ అసిస్టెంట్ మేనేజర్ కాలుకి గాయం కాగా.. సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. జిన్నారం మీదుగా పారిపోయిన ఈ ముఠాను పట్టుకోవడానికి 20 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి ప్రకటించారు. మాదాపూర్ డీసీపీ వినీత్, మియాపూర్ ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్ ఈ కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.
ఉదయం షోరూమ్ తెరిచీ తెరవగానే..
జాతీయ రహదారిపై గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంను యథావిధిగా మంగళవారం ఉదయం 10.15 గంటలకు తెరిచారు. ఆ సమయంలో విధులకు హాజరైన 25 మంది సిబ్బందితో రోజూ మాదిరిగానే డిప్యూటీ మేనేజర్ సతీష్‌కుమార్ మాట్లాడుతున్నారు. 10.30 గంటల ప్రాంతంలో ఆ షోరూం వద్దకు మాస్క్‌తో వచ్చిన ఓ ఆగంతకుడు ఫోన్ ద్వారా తన ముఠా సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తర్వాత ఐదు నిమిషాలకు రెండు ద్విచక్ర వాహనాలపై మరో ఐదుగురు అక్కడకు చేరుకున్నారు.
ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తూ..
ఒకరు షోరూం బయటనే ఆగిపోగా.. మరొకరు ప్రధాన ద్వారం దగ్గర కాపు కాశారు. మిగిలిన నలుగురూ నేరుగా సిబ్బంది ఉన్న ప్రాంతానికి వచ్చారు. మాస్క్‌లు ధరించి ఉన్న దుండగులను వినియోగదారులని ఉద్యోగులు భావించారు. ఏం కావాలని అడగడానికి ఓ ఉద్యోగి వస్తుండగా తుపాకులు ఉన్న ముగ్గురు దుండగలు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తూ డిప్యూటీ మేనేజర్‌ను లాకర్ తాళాలు ఇవ్వాలంటూ బెదిరించారు. ఆయన తన వద్ద తాళాలు లేవని చెప్పడంతో ‘చుప్ బే’అంటూ బెదిరించిన ఓ దుండగుడు అతని ఎడమ కాలుపై కాల్చాడు. షోరూమ్‌లో ఉన్న రెండు సీసీ కెమెరాలను కూడా కాల్చారు.
గోల్డ్ కోటెడ్‌వే నిజమైనవి అనుకుని..
ప్రతిరోజూ షోరూమ్ మూసేముందు అదే అంతస్తులోని మెజ్జనైన్ ఫ్లోర్‌లో ఉన్న లాకర్‌లో బంగారు ఆభరణాలను భద్రపరుస్తారు. ఉదయం షోరూమ్ తెరిచిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ తాళాలు తీస్తే బంగారు ఆభరణాలను బయటకు తీసువచ్చి కింది ఫ్లోర్‌లో ఉన్న షో కేసుల్లో సర్దుతారు. అయితే మంగళవారం ఉదయం దుండగులు వచ్చిన సమయానికి అసిస్టెంట్ మేనేజర్ రాకపోవడంతో ఈ బంగారం దోపిడీ దొంగలకు దొరకలేదు.
ఈ షోరూమ్‌లో వినియోగదారులకు చూపించడానికి బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టడానికి ఉన్న కొన్ని షోకేస్‌లతో పాటు ఆభరణాలను డిస్‌ప్లే చేయడానికి ఉన్న షో కేసుల్లో గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలను ఉంచుతారు. వీటినే బంగారు ఆభరణాలుగా భావించిన దుండగులు ఆ షోకేసుల్ని ధ్వంసం చేసి అందులో ఉన్న ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకుని వాహనాలపై ఉడాయించారు. ఈ వెండి ఐదు నుంచి పది కిలోల వరకు ఉండచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం పది నిమిషాల్లోనే ఈ దోపిడీ ముగిసింది.
పక్కాగా రెక్కీ చేసిన తర్వాతే నేరం!
దుండగులు రెండుమూడు రోజుల పాటు రెక్కీ చేసిన తర్వాతే దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి వచ్చిన కమిషనర్ అవినాష్ మహంతి బందిపోటు దొంగతనం జరిగిన తీరును తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ప్రత్యేక బృందాలు.. నేరం చేసిన తర్వాత దుండగులు చందానగర్–పటాన్‌చెరు–కృష్ణారెడ్డిపల్లి–జిన్నారం మీదుగా పరారైనట్లు గుర్తించారు.
దుండగుల్లో ఒకడు ‘చుప్ బే’అనే పదం వాడటాన్ని బట్టి.. అది మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షోరూం డిప్యూటీ మేనేజర్ ఆరోగ్యం నిలకడగా ఉంది.