
పుణేలో ఒకరిని అదుపులోకి తీసుకున్న ఎస్‌ఓటీ
దుండగులు వాడింది పాయింట్ 9 ఎంఎం పిస్టల్స్‌గా నిర్ధారణ
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లోని గంగారం వద్ద ఉన్న ఖజానా జ్యువెలరీ షోరూంలో మంగళవారం దొంగతనానికి పాల్పడిన ముఠాలో ఓ దుండగుడు చిక్కాడు. మహారాష్ట్రలోని పుణేలో ఒకరిని అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఈ ముఠా బిహార్‌కు చెందినదిగా గుర్తించారు. మిగిలిన నిందితుల కోసం మహారాష్ట్రతో పాటు బిహార్‌లో ముమ్మరంగా గాలిస్తున్నారు. గంగారంలో నేరం చేసిన తర్వాత ఆరుగురు నిందితులు రెండు ద్విచక్ర వాహనాలపై కర్ణాటకకు వెళ్లారు. ఆ రాష్ట్రంలో వాహనాలను వదిలేసి ఎవరికి వారుగా విడిపోయారు.
చోరీ సొత్తుతో ఇద్దరు వెళ్లిపోగా... మిగిలిన నలుగురిలో ఒకరు పుణే చేరుకున్నారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలతో పాటు సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తుచేసిన సైబరాబాద్ పోలీసులు పుణేలో ఉన్న నిందితుడి ఆచూకీ కనిపెట్టారు. గురువారం అతడిని అదుపులోకి తీసుకుని ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. దుండగులు వినియోగించినవి బిహార్‌లో తయారైన పాయింట్ 9 ఎంఎం క్యాలిబర్ నాటు పిస్టల్స్‌గా తేల్చారు.
గరిష్టంగా అరగంటలో చందానగర్ చేరుకునే విధంగా ఈ ముఠా ఆశ్రయం ఏర్పాటు చేసుకున్నట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ‘బిహార్‌కు చెందిన ఈ దోపిడీ, బందిపోటు ముఠాలు దుకాణాలనే టార్గెట్ చేస్తుంటాయి. ఆ షాపు తెరిచేప్పుడు లేదా మూసేటప్పుడు మాత్రమే విరుచుకు పడతాయి. ఖజానా జ్యువెలరీ నుంచి ఎత్తుకుపోయిన వెండి మొత్తం బిహార్ వెళ్లిన వారి వద్దే ఉన్నాయి. అక్కడి ఈ సొత్తును విక్రయించి సొమ్ము చేసుకుని పంచుకుంటారు’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.