
సాక్షి, హైదరాబాద్: నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల కుంభకోణం బట్టబయలైంది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.3 కోట్ల విలువైన డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు స్వాధీనం చేసుకున్నారు. షాహిద్ అలీ, ఇర్ఫాన్ అలీ, సంతోష్ రాజ్‌పురోహిత్‌లు ముగ్గురని అరెస్ట్ చేశారు. వీరంతా ముంబైలోని ఏజెంట్ల నుంచి డూప్లికేట్ యాపిల్ గాడ్జెట్లు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
యాపిల్ లోగో, స్టిక్కర్లు, సీల్‌లతో నకిలీ ప్యాకేజింగ్ చేసి అసలైనవిగా నమ్మించి కస్టమర్లను మోసం చేస్తున్నట్లు తెలిపారు. యాపిల్ వాచ్‌లు, ఎయిర్‌పాడ్స్, పవర్‌బ్యాంకులు, కేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2,761 నకిలీ ఉత్పత్తులు సీజ్ చేశారు. నిందితులను మీర్‌చౌక్ పోలీసులకు టాస్క్ ఫోర్స్ అప్పగించింది. యాపిల్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ ఈ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.