4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు | 4th Century Sculpture of Mahishasurmardini Found At Nalgonda | Sakshi
Sakshi News home page

Nalgonda: 4వ శతాబ్దంనాటి మహిషాసురమర్ధిని విగ్రహం గుర్తింపు

Oct 13 2021 11:53 AM | Updated on Oct 17 2021 3:55 PM

4th Century Sculpture of Mahishasurmardini Found At Nalgonda - Sakshi

శిల్పాన్ని పరిశీలిస్తున్న డాక్టర్‌ శివనాగిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్నవేళ అతి పురాతన మహిషాసురమర్ధిని శిల్పం వెలుగు చూసింది. విష్ణుకుండినుల హయాంలో నాలుగో శతాబ్దంలో రూపొందిన ఈ రాతి విగ్రహాన్ని నల్లగొండ జిల్లాలో చరిత్ర పరిశోధకులు గుర్తించారు. కట్టంగూరు రోడ్డులో పానగల్లుకు 3 కిలోమీటర్ల దూరంలో గల దండంపల్లి శివారులో ఓ చెట్టుకింద దీన్ని కనుగొన్నారు. గతంలో పొలానికి కాలువ తవ్వుతుండగా ఇది బయటపడింది. అక్కడి చెట్టుకింద ఉన్న పురాతన వినాయకుడి విగ్రహం ముందు దీన్ని ఉంచారు. కానీ అది నాలుగో శతాబ్దికి చెందిన పురాతన విగ్రహమన్న విషయం స్థానికులకు తెలియదు.

తాజాగా ఆ ప్రాంతానికి చెందిన తెలుగు పండితుడు సైదులు ఇచి్చన సమాచారం మేరకు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, నల్లగొండ చరిత్ర కాంగ్రెస్‌ పూర్వ అధ్యక్షుడు డాక్టర్‌ డి.సూర్యకుమార్‌తో కలసి ఆ విగ్రహాన్ని పరిశీలించారు. అక్కడ లభించిన ఇటుకల పరిమాణం ఆధారంగా ఈ విగ్రహాన్ని విష్ణుకుండినుల కాలంనాటిదిగా నిర్ధారణకు వచ్చినట్లు శివనాగిరెడ్డి తెలిపారు.

రాతి శిల్పం 10 సెం.మీ. పొడవు, 5 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంతో ఉందని, అమ్మవారు మహిషరూపంలో ఉన్న రాక్షసుడి మెడపై ఎడమకాలితో తొక్కి పట్టి, ఎడమ చేతితో తోకను పట్టుకుని కుడి చేతిలో శూలం, మిగతా రెండు చేతుల్లో శంఖుచక్రాలతో ఉందని పేర్కొన్నారు. చెవి కుండలాలు, తలపై పాగా తరహా కిరీటం, వెనకవైపు గుండ్రటి ప్రభామండలాలతో తెలుగువారి తొలితరం ప్రతిమాలక్షణాలతో ఉందని తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement