‘సీఎమ్మార్‌’పై నిర్లక్ష్యం | Sakshi
Sakshi News home page

‘సీఎమ్మార్‌’పై నిర్లక్ష్యం

Published Sat, Jun 10 2023 4:23 AM

negligence on custom milling rice cmr - Sakshi

జగిత్యాల రూరల్‌: జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని వాటి సామర్థ్యాన్ని బట్టి రైస్‌మిల్లులకు ప్రభుత్వం కేటాయించింది. ధాన్యాన్ని మరపట్టించి బియ్యంగా మార్చి స ర్కారు ఇచ్చిన గడువులోగా సీఎమ్మార్‌ అప్పగించాలి. కానీ, రైస్‌మిల్లర్లు బియ్యం అప్పగింతలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఫలితంగా బియ్యం సేకరణలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవడంతోపాటు ఆంక్షలు విధిస్తోంది. అంతేకాదు.. నిర్దేశిత గడువులోగా  బియ్యం అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి పెంచుతోంది. మిల్లుల్లో అధికారులను నియమించి మర ఆడించే పనులనూ పర్యవేక్షిస్తోంది. 

సెప్టెంబర్‌ వరకు గడువు 

  • 2022–23 వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సేక రించిన 3,38,187 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జిల్లాలోని 132 రైస్‌మిల్లులకు అప్పగించింది. 
  • ఆ ధాన్యం స్వీకరించిన మిల్లర్లు.. 2,26,585 మెట్రిక్‌ టన్నుల కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎమ్మార్‌)ను ప్రభుత్వాని(ఎఫ్‌సీఐ)కి అప్పగించాల్సి ఉంది. 
  • కానీ, ఇప్పటివరకు కేవలం 28,780 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు సర్కారుకు అప్పగించారు. 
  • రంగంలోకి దిగిన అధికారులు.. మిగతా బియ్యాన్ని సెప్టెంబర్‌ చివరి నాటికి అప్పగించాలని మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు. 

బియ్యం అప్పగింతలో జాప్యం.. 
జిల్లాలో 2021–22 వానాకాలం సీజన్‌లోనూ 3,25,444 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 135 మంది రైస్‌మిల్లర్లకు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 2,06,171 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని తిరిగి అప్ప గించారు. ఇంకా 38 మంది రైస్‌మిల్లర్లు 11,875 మె ట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2021– 22 యాసంగి సీజన్‌లో 2,70,776 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 125 మంది రైస్‌మిల్లర్లకు అధికారులు అప్పగించారు. మిల్లర్లు ఇప్పటివరకు 1,77,018 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీఎమ్మార్‌ కింద ఎఫ్‌సీఐకి అప్పగించారు. మిగతా ఏడుగురు రైస్‌మిల్లర్లు.. 6,400 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 

నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 
జిల్లాలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లర్లు. సకాలంలో సీఎమ్మార్‌ అప్పగించడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం మిల్లర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతోపాటు, ఆయా రైస్‌మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలు తరచూ తనిఖీ చేయిస్తోంది. నిల్వల్లో వ్యత్యాసం వచ్చిన మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటోంది. 

ప్రతినెలా సమీక్ష.. 

  • సీఎమ్మార్‌ అప్పగింతలో రైస్‌మిల్లర్లు చేస్తున్న జాప్యంపై చర్యలు చేపట్టడంతో పాటు, ప్రతినెలా రైస్‌మిల్లర్లతో కలెక్టర్, అదనపు కలెక్టర్లు సమీక్షిస్తున్నారు. 
  • నిర్దేశిత గడువులోగా బియ్యం అప్పగించాలని రైస్‌మిల్లర్లను ఆదేశిస్తున్నారు. 
  • బియ్యం అప్పగించిన మిల్లర్లు మినహా అప్పగించని వారిని గుర్తించడంలో అధికారులు నిమగ్నమయ్యారు.

Advertisement
 
Advertisement
 
Advertisement