KCR, KTR And Others Emotional Condolence To Folk Singer Sai Chand Demise - Sakshi
Sakshi News home page

సాయిచంద్‌ మృతిపై కేసీఆర్‌ ఆవేదన, హరీష్‌ రావు కంటతడి.. ఆ పేరు శాశ్వతమన్న కేటీఆర్‌

Jun 29 2023 7:54 AM | Updated on Jun 29 2023 12:33 PM

KCR KTR Others Emotional Condolence To Sai Chand Demise - Sakshi

నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన.. 

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు,  రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అని, మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. 

సాయిచంద్ హఠాన్మరణం పట్ల సీఎం కేసీఆర్‌  సంతాపాన్ని ప్రకటించారు.  సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని.. కళాకారున్ని  కోల్పోయింది. రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుంది అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.  

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను.. చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్‌ ఈ సందర్భంగా మననం చేసుకుంటున్నట్లు తెలిపారాయన. సాయిచంద్  లేకుండా.. అతని గొంతులేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే నున్నాడని గుర్తు చేసుకున్నారు.  తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని.. నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన  సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. 

హరీష్‌ రావు కంటతడి
సాయిచంద్‌ హఠాన్మరణం వార్తతో గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రికి తరలి వెళ్లారు పలువురు నేతలు. వాళ్లలో మంత్రి హరీష్‌ రావు కూడా ఉన్నారు. సాయిచంద్‌ మృతదేహాన్ని చూసి ఆయన కంటతడి పెట్టుకున్నారు.  చిన్నవయసులో కన్నుమూయడం బాధాకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన.  ఆస్పత్రిలో ఫార్మాలిటీస్‌ పూర్తికావడంతో గుర్రంగూడలోని సాయిచంద్‌ నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు.

► సాయిచంద్ మృతిపట్ల పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి సంతాపం తెలియజేశారు.

సాయి చంద్‌ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది
సాయిచంద్ మృతిపట్ల కల్వకుంట్ల తారకరామారావు విచారం వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం తనని దిగ్భ్రాంతికి గురిచేసిందని.. యువకుడైన సాయిచంద్ అకాల మరణం చెందడం బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి తెలంగాణ సమాజానికి ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీకి తన గొంతుక ద్వారా ఎనలేని సేవలు చేసిన సాయిచంద్ మరణం తీరని లోటు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement