
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్-బీజేపీలు కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు తెలంగాణ రాజకీయాలను కాస్త హీటెక్కించాయి. అయితే అది ఎట్టి పరిస్థితుల్లో జరగబోదని ఇరు పార్టీలు తేల్చేశాయి. ఈలోపు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతూ బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆయన కుమార్తె, ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ కలకలం రేపింది.
అయితే ఈ లేఖపై కవిత లేఖ(Kavitha Letter)పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. ‘‘కవిత లేఖ ఉత్తదే. కేసీఆర్‌కు సలహా ఇచ్చే స్థాయిలో కవిత ఉందా?. బీజేపీ పై ఎంతసేపు మాట్లాడాలో కవిత డిసైడ్ చేస్తదా?. కేటీఆర్ హరీష్ రావులే ఈ లేఖ తయారు చేయించారు. కవిత పేరుతో బయటకు వదిలారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలసి పోటీ చేయడం ఖాయం. ఈ లేఖతోనే బీజేపీ, బీఆర్ఎస్ బంధం బయటపడింది. వరంగల్ సభతో బీఆర్ఎస్ పని అయిపోయిందని తేలిపోయింది. అందుకే ఈ డ్రామాలు’’ అని అన్నారాయన.
మరోవైపు.. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ కీలక నేతలు స్పందించేందుకు నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కవిత లేఖపై స్పందించాలని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), సీనియర్ నేత హరీష్‌రావును మీడియా కోరగా.. ఇద్దరూ స్పందించలేదు. ఓ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మైక్‌ను పక్కకు తోసేయగా.. హరీష్‌రావు(Harish Rao) మాత్రం కవిత లేఖపై త్వరలో స్పందిస్తామంటూ హడావిడిగా కారెక్కి వెళ్లిపోయారు.
కిందటి నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ ధూం ధాం సభ సక్సెస్ అయ్యిదంటూనే.. అది పార్టీ కార్యకర్తలను ఆకట్టుకోలేకపోయిందంటూ కొన్ని ప్రతికూల పాయింట్లను ఆమె లేఖలో ప్రస్తావించినట్లు నోట్ ఒకటి తెర మీదకు వచ్చింది. పైగా బీజేపీ గురించి తక్కువ మాట్లాడేసరికి ఆ పార్టీతో పొత్తు ఉండబోతుందనే ప్రచారం బలంగా సాగుతోందంటూ అందులో వివరణాత్మకంగా రాసి ఉంది.

‘‘బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు(BRS-BJP Alliance) పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన నేను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది’’ అయితే ఆ నోట్ ఆమె రాసిందేనా? అనేదానిపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాకే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
కవిత లేఖపై అనుమానాలు: డీకే అరుణ
కేసీఆర్‌కు కవిత లేఖ లేఖ రాయాల్సిన అవసరం ఏముందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారామె.
ఇదీ చదవండి: మై డియర్ డాడీ..