సేలం: రైల్వే శాఖ ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ దిశగా సేలం రైల్వే డివిజన్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పాత రైలు బోగీని అత్యాధునిక శైలిలో పునరుద్ధరించి, ఆకర్షణీయమైన రెస్టారెంట్‌గా మార్చింది. సేలం సమీపంలోని అయోధ్య పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ రైల్ కోచ్ రెస్టారెంట్‌ను సేలం డివిజనల్ రైల్వే మేనేజర్ పన్నా లాల్ సోమవారం ప్రారంభించారు.
రైల్ కోచ్ రెస్టారెంట్
సేలం – విరుదాచలం రైలు మార్గంలో ఉన్న అయోధ్య పట్టణం రైల్వే స్టేషన్ ఆవరణలోని 1,000 చదరపు మీటర్ల రైల్వే స్థలంలో ఈ రెస్టారెంట్‌ను తీర్చిదిద్దారు. పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం కింద 5 ఏళ్ల కాలపరిమితికి గాను ఒక ప్రైవేట్ సంస్థకు దీని నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ ఒప్పంద కాలంలో సేలం రైల్వే డివిజన్‌కు రూ.46.20 లక్షల మేర ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేశారు.


