తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో బైక్ దొంగను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. తిరుత్తణి కొండ ఆలయానికి బైకులో వచ్చి పార్కింగ్ చేసి స్వామి దర్శనానికి భక్తులు వెళ్తున్న క్రమంలో బైకులు చోరీకి గురవుతున్నాయి. దీనిపై ఫిర్యాదులు నిత్యకృతమయ్యాయి. ఈ నేపథ్యంలో గత వారం తిరుత్తణి పెరియార్ నగర్‌కు చెందిన సత్యనారాయణన్(30)బైకులో కొండకు వెళ్లి పార్కింగ్ చేసి స్వామి దర్శనానికి వెళ్లిన సమయంలో అతని బైక్ చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో అరక్కోణంకు చెందిన శరవనన్(25) బైక్ చోరీ చేసినట్లు తేలింది. బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసారు.
తిరువొత్తియూరు: కోడంబాక్కం, అక్బరాబాద్ 1వ వీధికి చెందిన రఘువరన్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈయన గత 14న ఇంటికి తాళం వేసి, కుటుంబంతో కలిసి తన సొంత ఊరైన వందవాసిలోని కులదైవం గుడికి దర్శనానికి వెళ్లారు. ఇదే అవకాశంగా దొంగలు పడ్డారు. రఘువరన్ ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న 6 సవర్ల బంగారు నగలు, 250 గ్రాముల వెండి వస్తువులు, రూ.30 వేల నగదు చోరీ చేశారు. ఆదివారం రాత్రి రఘువరన్ తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానించి లోపలికి వెళ్లేసరికి చోరీ జరిగినట్లు గ్రహించాడు. కోడంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అసెంబ్లీ స్పీకర్ ప్రభాకర్
కొరుక్కుపేట: చైన్నె అన్నా స్విమ్మింగ్ పూల్‌లో జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్–2026 పోటీలను సోమవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ పోటీలు ఏపీజే హెల్త్ బోట్ ఎల్‌ఎల్‌పి డైరెక్టర్ అజయ్ విజయేంద్రన్ నేతృత్వంలో అడయార్‌కి చెందిన పెడోడాంటిస్ట్ డాక్టర్ టి. పావని సహకారంతో శ్రీమెరుగైన ఆరోగ్యం –మెరుగైన మీరుశ్రీ అనే నినాదంతో నిర్వహించారు. అడయార్ శిష్యా పాఠశాల ప్రిన్సిపాల్ ఓమనా థామస్, రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ (ఎస్‌డిఏటి) మెంబర్ సెక్రటరీ జే మేఘనాథరెడ్డి, భారత ప్రభుత్వ ఆదాయపు పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ టీవీ వంశీధర్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. పోటీల్లో పలు ఈవెంట్‌లలో 150 మందికి పైగా యువ ఈతగాళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.
పళ్ళిపట్టు: దండుమారియమ్మ ఆలయ వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన అగ్నిగుండ వేడుకల్లో 200 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి మొక్కులు చెల్లించారు. పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేట టౌన్ పంచాయతీలో అంబేడ్కర్ నగర్‌లో దండుమారియమ్మన్ ఆలయ వార్షికోత్సవం 14న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ఆలయంతో పాటు గ్రామ వీధులు విద్యుదీపాలతో అలంకరించారు. భక్తులు కంకణాలు ధరించి దీక్షలు చేపట్టారు. రోజూ అమ్మవారికి విశేష అభిషేక పూజలు చేశారు. 15న అమ్మవారికి కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. వేడుకల్లో ప్రధానమైన అగ్నిగుండ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. కంకణధారులైన భక్తులు ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండానికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్పాలంకరణలో అగ్నిగుండం ముందు దండుమారియమ్మ కొలువుదీరారు. రాత్రి 9 గంటల సమయంలో బాణసంచా సంబరాలు నడుమ భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. రాత్రి అమ్మవారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
తిరువొత్తియూరు: చిరునామా అడుగుతున్నట్లు నటించి మహిళ వద్ద 4 సవర్ల నగను లాక్కుని ఉడాయించారు చెయిన్ స్నాచర్లు. చైన్నె టి.నగర్ ప్రాంతానికి చెందిన ఉష ( 53) ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని దుకాణానికి వెళ్లడానికి త్యాగరాయ నగర్ మోట్లీ 1వ వీధిలో కాలినడకన వెళ్తుండగా మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఉష మెడలో ఉన్న బంగారు గొలుసును లాగారు. తర్వాత ఆమైపె దాడి చేశారు. కిందకు తోసేసి బంగారు గొలుసును బలంగా లాక్కుని బైక్‌లో ఉడాయించారు.


