సాక్షి, చైన్నె: తంజావూరులో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లను అధికారులు తొలగించడంతో టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న వీసీకే కార్యకర్తలు ఆగ్రహించారు. నిరసనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఘర్షణలో ఎస్‌ఐపై దాడికి పాల్పడిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బ్యానర్ల తొలగింపు – ముట్టడి
వీసీకే అధినేత తిరుమావళవన్ పుట్టినరోజు సందర్భంగా తంజావూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఆ పార్టీ కార్యకర్తలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకపోవడంతో కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు. కార్యకర్తలు రైల్వే స్టేషన్ రోడ్డుపై ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న వెస్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేసేందుకు యత్నించారు. ఆ సమయంలో బైక్‌పై వచ్చిన ఓ యువకుడు తనకు దారి ఇవ్వాలని కోరడంతో వీసీకే కార్యకర్తలకు, అతని మధ్య వాగ్వా దం చోటుచేసుకుంది. సర్దిచెప్పేందుకు యత్నించిన వెస్ట్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అబ్దుల్ రహీమ్‌పై ఆ యువకుడు దాడికి తెగబడ్డాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.


