సేలం: మధురైలో పోలీస్ స్టేషన్ విచారణకు వెళ్లి వచ్చిన ఒక జ్యోతిష్యుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల దాడి వల్లే ఆయన మరణించారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఈ ఘటనపై ఆర్‌డీఓ విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.వివరాలు.. మధురై మేల అనుప్పానడి హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన పరమశివం (55) అనే వ్యక్తి స్థానిక శివన్ ఆలయంలో జ్యోతిష్యుడిగా పనిచేసేవాడు. ఆయనకు భార్య అయ్యమ్మాళ్, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
స్థల వివాదం
పరమశివానికి, ఆయన పొరుగున ఉండే బాలకృష్ణన్–మాలతి దంపతులకు ఉమ్మడి స్థలాన్ని ఉపయోగించే విషయంలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. జూలై 19న ఇరువర్గాల మధ్య జరిగిన వివాదంలో మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పరమశివంపై కేసు నమోదు చేశారు. జూలై 23న ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.
కుటుంబ సభ్యుల తీవ్ర ఆరోపణలు
విచారణ పేరుతో జూలై 19న పరమశివాన్ని చింతామణి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు ఆయనపై తీవ్రంగా దాడి చేశారని బంధువులు ఆరోపించారు. పోలీస్ దాడి వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన పరమశివాన్ని ముందుగా మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో, ఆ తర్వాత ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించామని, చికిత్స పొందుతూ ఆయనఆదివారం రాత్రి మరణించారని తెలిపారు.


