ఆన్‌లైన్‌లో పట్టాలో మారిన పేరు న్యాయం కోసం వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆత్మాహుతికి ఒడిగట్టిన బాధితుడు అడ్డుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
తిరువళ్లూరు: ఆన్‌లైన్ పట్టాలో పట్టాదారుడిగా తన పేరుకు బదులుగా వేరే వ్యక్తి పేరు ఉందని, దీనిని మార్చాలని పలుసార్లు కలెక్టర్‌తో సహా ఉన్నత అధికారులకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని నిరసిస్తూ ఓ బాధితుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని కలెక్టరేట్ వద్ద ఆత్మాహుతికి యత్నించాడు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పింజివాక్కం గ్రామానికి చెందిన ఏలుమలై(42). ఇతడికి అదే ప్రాంతంలోనే 31 సెంట్లు వ్యవసాయ భూమి వుంది. ఇతడిపై మ్యానువల్ పట్టాతో పాటు ఇతర డాక్యుమెంట్లు వున్నాయి. ఈ క్రమంలో ఇటీవల అధికారులు భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏలుమలైకు చెందిన భూమి వేరే వ్యక్తి పేరిట పట్టా లిఖించారు. దీనిని గుర్తించిన భాదితుడు తమకు న్యాయం చేయాలని కోరుతూ పలుసార్లు కలెక్టర్‌తో సహా ఉన్నత అధికారులకు వినతి పత్రం సమర్పించాడు. అయితే ఇంత వరకు న్యాయం చేయలేదు. దీంతో విసిగి వేసారిన బాధితుడు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించాడు. పోలీసులు అప్రమత్తమై ఏలుమలైను అడ్డుకున్నారు. అతడిపై నీళ్లు పోసి విచారణ నిమిత్తం తిరువళ్లూరు టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.


