తమిళసినిమా: నటుడు ప్రభుదేవా, హాస్యనటుడు వడివేలులది హిట్ కాంబినేషన్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 1990 ప్రాంతంలో వీరిద్దరూ కలిసి నటించిన పలు చిత్రాలు విజయ వంతమయ్యాయి. కాగా సుమారు 25 ఏళ్ల తరువాత మీరు మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం బ్యాంగ్ బ్యాంగ్. కే ఆర్ జి. కన్నన్ రవి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దీపక్ రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్యామ్ రోట్రిక్స్ కథ దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, హెచ్‌సీ వేణు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ను విడుదల చేశారు. విచిత్రమైన కౌబాయ్ దుస్తులను ధరించిన ప్రభుదేవా, వడివేలును జోంబీలు తరుము కొస్తుండగా వాటిని వారు ఎదిరించే టీజర్ ఇప్పుడు ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా ప్రభుదేవా యాక్షన్ సన్నివేశాలు వడివేలు హాస్యంతో కూడిన ఈ టీజర్ చిత్రంపై అంచనాలను పెంచేస్తుంది. చిత్రంలోని ముఖ్య సన్నివేశాలను ఇండో నేషియాలోని మౌంట్ బ్రోమో ప్రాంతంలోని రగులుతున్న లావా నేపథ్యంలోనూ, మలేషియాలోనూ చిత్రీకరించినట్లు యూనిట్ సభ్యులు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నటుడు బబ్లూ పృథ్వీరాజ్ ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రం యాక్షన్, వినోదం వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని పేర్కొన్నారు.
బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో ప్రభుదేవా, వడివేలు


