సాక్షి, చైన్నె: టీవీకే ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, న్యాయ పోరాటాలు విస్తృతం చేద్దామని డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. డీఎంకే ఉత్తర జోన్ న్యాయవాదుల సమావేశం న్యాయ విభాగం కార్యదర్శి ఎన్.ఆర్. ఇలంగో నేతృత్వంలో చైన్నె అరివాలయంలో ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులు: డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్. భారతి, ఎంపీ విల్సన్ పలువురు సీనియర్ నాయకులు, న్యాయవాదులు హాజరయ్యారు. తిరువళ్లూరు, రాణిపేట, కడలూరు, వెల్లూరు, తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, కృష్ణగిరి, పుదుచ్చేరి తదితర ప్రాంతాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఉదయ నిధి సూచనలు
ఈసమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, 2018లో కళైజ్ఞర్ (కరుణానిధి) మరణించినప్పుడు, ఆయనను మెరీనా బీచ్‌లోని అన్నా స్మారకం వద్ద అంత్యక్రియలు నిర్వహించకూడదని అప్పటి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. అయితే డీఎంకే న్యాయ విభాగం హైకోర్టులో మెరుపు వేగంతో పోరాడి ఆ కలను నిజం చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వం (ఫాసిస్ట్ విధానాలతో) అభద్రతాభావంతో వ్యవహరిస్తూ వ్యతిరేకంగా మాట్లాడే వారిని, ప్రతిపక్ష నాయకులను, యువతను అరెస్టు చేయడానికి షెడ్యూల్ వేసుకుని మరీ వేధిస్తోందని ఆరోపించారు. అరెస్టులు, కేసులకు డీఎంకే లేదా దాని న్యాయ విభాగం, యువజన విభాగం ఎప్పుడూ భయపడదని స్పష్టం చేశారు. పాత మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని విమర్శించారు. ఇటీవల తనను అరెస్టు చేసిన విషయాన్నిప్రస్తావిస్తూ చైన్నె నుంచి తంజావూరు వరకు తనను ఏదో ట్రిప్పుకు తీసుకెళ్లినట్టు తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ఈ సమయంలో కేడర్ అంతా బయటకు రావడంతో డీఎంకే బలం ఏమిటో ఈ పాలకులకు తెలియ వచ్చిందన్నారు. కాగా, ఈ సమావేశంలో ప్రభుత్వ తీరును ఖండిస్తూ, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలు తీర్మానాలు ఆమోదించారు.


