సాక్షి, చైన్నె: తమిళనాడులోని రైతులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా మధ్యస్థ సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా పంట రుణాలు పొంది, రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాను సహకార శాఖ ఆదివారం విడుదల చేసింది.
పూర్తి – పాక్షిక మాఫీ
రూ. 75,000 వరకు పంట రుణాలు తీసుకున్న రైతులకు పూర్తి రుణమాఫీ వర్తిస్తుంది. రూ. 75,000 కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు రూ. 35,000 వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14.43 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం దీని కోసం దాదాపు రూ. 5,932 కోట్లకు పైగా నిధులను కేటాయించింది. అర్హులైన రైతుల జాబితాలను సంబంధిత జిల్లా సహకార బ్యాంకులు, సహకార సంఘాల కార్యాలయాల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచారు. సహకార శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా రైతులు తమ పేర్లను సరిచూసుకోవచ్చని వెల్లడించారు.


