క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

గవర్నర్‌ భవనం గోడను ఢీకొన్న కారు

– విద్యార్థి సహా ఐదుగురికి గాయాలు

కొరుక్కుపేట: చైన్నె గిండిలోని గవర్నర్‌ భవనం గోడను ఢీకొన్న ప్రమాదంలో కళాశాల విద్యార్థి సహా ఐదుగురు గాయపడ్డారు . చైన్నెలోని పశ్చిమ మాంబలం ప్రాంతానికి చెందిన బాల ఆకాష్‌ (20), చైన్నెలోని సమయపుర కళాశాలలో తన బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ పరిస్థితిలో శనివారం అర్ధరాత్రి 12.45 గంటలకు, బాల ఆకాష్‌ తన స్నేహితులు జాన్‌, కౌశిక్‌, రాఘవ్‌, రాధిక , ఇతరులతో కలిసి, ఈసీఆర్‌ బీచ్‌ ప్రాంతంలో సూర్యోదయాన్ని వీక్షించడానికి సైదాపేట తాలూకా బస్‌ రోడ్డు వెంబడి కారును అతివేగంగా నడుపుకుంటూ బయలుదేరాడు. గిండిలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ రోడ్డులో ఉన్న గవర్నర్‌ భవనం ప్రధాన ద్వారం వద్దకు సమీపిస్తుండగా, కారు అకస్మాత్తుగా అదుపు తప్పి, ఇనుప కంచెలను బద్దలుకొట్టి, గవర్నర్‌ భవనం ఆవరణలోని గోడను ఢీకొట్టింది. ఈ ధాటికి గవర్నర్‌ భవనం గోడ దెబ్బతింది. ఇది చూసిన గవర్నర్‌ భవనానికి కాపలాగా ఉన్న పోలీసు అధికారులు దిగ్భ్రాంతికి గురై హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు . ఈ .ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బాల ఆకాష్‌, అతని స్నేహితులుకౌశిక్‌, జానన్‌ తదితరుల ఐదుగురిని సైదాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అడయార్‌ ట్రాఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి నుంచి కారును స్వాధీనం చేసుకుని, విచారణ జరిపి, కేసు చేస్తున్నారు.

టాపర్‌లకు నగదు బహుమతి

తిరువళ్లూరు: పాఠశాల స్థాయిలో పదవ, ప్లస్‌–2 పరిక్షల్లో టాపర్‌లుగా నిలిచి వారికి సెంథిల్‌కుమార్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో బహుమతులను ప్రదానం చేశారు. తిరువళ్లూరు జిల్లా పట్రపెరంబదూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాఠశాల స్తాయిలో పదవ, ప్లస్‌టూ పరిక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతి అందజేసే కార్యక్రమం సెందిల్‌కుమార్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన పారిశ్రామికవేత్త సత్యమూర్తి బహుమతులను అందజేశారు. దిలీప్‌ధర్మన్‌(పదవ తరగతి), రోజిత్‌కుమార్‌ (ప్లస్‌టూ) తదితరులకు పది వేల చొప్పున 20 వేలు, రెండవ స్థానంలో నిలిచిన శ్రీవిష్ణు(పదవ తరగతి) ఆర్తీ(ప్లస్‌టూ)కు 7500 చొప్పును 15 వేలు, మూడవ స్థానంలో నిలిచిన తమిళరసి(పదవతరగతి), విష్ణు(ప్లస్‌టూ) తదితరులకు ఐదువేలు చొప్పున పది వేల రూపాయలను బహుతులుగా అందజేశారు.

డీ–అడిక్షన్‌ సెంటర్‌ వద్ద

ఆందోళన

తిరువొత్తియూరు: ఆదంపాక్కం సురేందర్‌ నగర్‌లో ఒక ప్రైవేట్‌ డీ–అడిక్షన్‌ కేంద్రం నడుస్తోంది. ఇక్కడ అశోక్‌ నగర్‌కు చెందిన ఒక వ్యక్తిని చికిత్స కోసం అతని భార్య చేర్పించింది. అయితే, ఆ వ్యక్తి చెల్లెలు తన అన్నయ్యను తప్పుగా ఈ వ్యసన విముక్తి కేంద్రంలో చేర్చారని పేర్కొంటూ ఆదంపాక్కం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం దీంతో ఆగ్రహం చెందిన ఆ మహిళ , ఆమె బంధువులు పెద్ద సంఖ్యలో శనివారం రాత్రి డీ–అడిక్షన్‌ కేంద్రాన్ని ముట్టడించి, అకస్మాత్తుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఆదంపాక్కం పోలీసులు వారితో చర్చలు జరిపి అక్కడి నుంచి పంపించివేశారు. డాక్టర్ల సలహా మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

రూ.24 లక్షల అదృశ్యం కేసులో దర్యాప్తు ముమ్మరం

తిరువొత్తియూరు: వేళచ్చేరిలోని ఒక ప్రైవేట్‌ సంస్థ తరపున ఏటీఎం మిషన్లలో నగదు నింపే పనులు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఎప్పటిలాగే వేళచ్చేరి నుండి 105 పెట్టెలలో రూ.4 కోట్ల 69 లక్షల నగదుతో సంస్థకు చెందిన వాహనంలో ఉద్యోగులు చైన్నెలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 ఏటీఎంలలో నగదు నింపడానికి వచ్చారు. వారు పెరంబూర్‌ పేపర్‌ మిల్స్‌ రోడ్డులో ఉన్న ఏటీఎం మిషన్‌లో నగదు నింపుతున్నప్పుడు 3 పెట్టెలు తక్కువగా ఉన్నట్లు గమనించారు. వారు వచ్చిన దారిలో వెతకగా, పెరంబూర్‌ మురసోలి మారన్‌ ఫ్లైఓవర్‌ (వంతెన)పై నగదు ఉన్న 2 పెట్టెలు ఖాళీగా పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ఉన్న రూ. 24 లక్షలు మాయమయ్యాయి.

దీనిపై జే.సీ.ఐ.బీ. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ప్రాంతంలోని నిఘా కెమెరా (సీసీటీవీ) దృశ్యాలను పరిశీలిస్తున్నారు. భారీ భద్రతతో తీసుకెళ్లిన నగదు పెట్టెలు ఎలా మాయమయ్యాయి? ఖాళీ పెట్టెలు వంతెనపై ఎలా పడి ఉన్నాయి? అని పోలీసులకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నగదు నింపడానికి వచ్చిన ఉద్యోగులు, సెక్యూరిటీ గార్డు, డ్రైవర్‌తో సహా నలుగురిని పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. వారు పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఇస్తుండటంతో గందరగోళం నెలకొందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement