మేల్‌మరువత్తూరులో ఘనంగా ఆడిపుర ఉత్సవం | - | Sakshi
Sakshi News home page

మేల్‌మరువత్తూరులో ఘనంగా ఆడిపుర ఉత్సవం

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

● స్వయంభూ అమ్మవారికి 5 లక్షల మంది భక్తుల పాలాభిషేకం

తిరువొత్తియూరు: మేల్మరువత్తూరు ఆధిపరాశక్తి సిద్ధర్‌ పీఠంలో 55వ వార్షిక ఆడిపూరం మహోత్సవం మంగళ వాయిద్యాల శబ్దాల నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా సిద్ధర్‌ పీఠంలో కొలువై ఉన్న బంగారు అడిగలార్‌ పవిత్ర విగ్రహానికి, స్వయంభూ అమ్మవారికి ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, ఆరాధనలు నిర్వహించారు అనంతరం, ఆధ్యాత్మిక గురువు బంగారు అడిగలార్‌ పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం వేళల్లో కలశ విలక్కు (దీప) పూజలు ప్రత్యేక యజ్ఞాలు జరిగాయి. ఆడిపూరం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సాంప్రదాయ అంబలి నివేదన, స్వయంభూ అమ్మవారికి పాలాభిషేక కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆధ్యాత్మిక ఉద్యమ అధినేత్రి లక్ష్మి బంగారు అడిగలార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ కో.పా. అన్బళగన్‌, కో.పా. సెంథిల్‌ కుమార్‌, శ్రీదేవి రమేష్‌, ఉమాదేవి జయగణేష్‌ , చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అగస్త్యన్‌ తదితరులు పాల్గొని స్వయంభూ అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఎరుపు రంగు వస్త్రాలు ధరించిన వేలాది మంది భక్తులు తమ తలపై పాల కలశాలను మోస్తూ సిద్ధర్‌ పీఠం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత స్వయంభూ అమ్మవారికి భక్తులందరూ తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేశారు. గత రెండు రోజులుగా జరిగిన ఈ పవిత్ర వేడుకల్లో సుమారు 5 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పాలాభిషేకాలు సమర్పించారు.ఈ ఆడిపూరం ఉత్సవాల్లో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆధిపరాశక్తి హాస్పిటల్‌ డైరెక్టర్‌ రమేష్‌, లక్ష్మీ బంగారు ఆర్ట్స్‌ కాలేజ్‌ కరస్పాండెంట్‌ ఆశా అన్బళగన్‌, నర్సింగ్‌ కాలేజ్‌ కరస్పాండెంట్‌ శ్రీలేఖ సెంథిల్‌ కుమార్‌, డాక్టర్‌ మధుమలర్‌ పాల్గొన్నారు. అలాగే మద్రాస్‌ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు, దక్షిణ రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ జయంత్‌ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో భాగస్వాములయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement