కారులో దారి తప్పిన నటుడు మమ్ముట్టి | - | Sakshi
Sakshi News home page

కారులో దారి తప్పిన నటుడు మమ్ముట్టి

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

● ఆదుకున్న శివగంగై యువకుడు

సాక్షి, చైన్నె : తమిళనాడులోని శివగంగై జిల్లా కారైక్కుడిలో సినిమా షూటింగ్‌ ముగించుకుని కారులో కేరళకు తిరుగు ప్రయనమైన ప్రముఖ మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి విచిత్ర అనుభవం ఎదురైంది. వేకువజామున దారితెలియక దాదాపు గంటసేపు ఇబ్బంది పడ్డ ఆయనకు ఒక స్థానిక యువకుడు బైక్‌పై 10 కిలోమీటర్లు ముందు వెళ్తూ సరైన దారి చూపి ఆదుకున్నాడు. ఈ సందర్భంగా ఆ యువకుడిని ‘నమ్మ ఫ్రెండ్‌’ (మా దోస్త్‌) అంటూ కొనియాడుతూ మమ్ముట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

గంటపాటు దారితెలియక తిప్పలు..

కారైక్కుడిలో షూటింగ్‌ పూర్తయిన తర్వాత, ఆగస్టు 12న తెల్లవారుజామున మమ్ముట్టి కారులో మదురై మీదుగా కేరళకు బయలుదేరారు. కారైక్కుడి – మేలూర్‌ కోత్త ఫోర్‌ లేన్‌ రహదారిలో తిరుపత్తూర్‌ సమీపంలోని పట్టమంగళం వద్ద తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారు చేరుకుంది. అక్కడ పలు రహదారులు విడిపోవడంతో మదురైకి ఏ దారిలో వెళ్లాలో తెలియక అయోమయం నెలకొంది. గూగుల్‌ మ్యాప్స్‌ సహాయం తీసుకున్నప్పటికీ సరైన మార్గం చూపించలేదు. పెట్రోల్‌ బంక్‌ సిబ్బంది చెప్పిన దారిలో వెళ్లినా సరైన రహదారి దొరక్కపోవడంతో తిరిగి కారైక్కుడికే వెళ్లిపోదామని భావించారు.

దేవుడిలా వచ్చిన యువకుడు

దాదాపు గంటసేపటి నుంచి ఒకే కారు అటు ఇటు తిరగడం గమనించిన పూలాంగురిచ్చికి చెందిన పాండ్యన్‌ అనే యువకుడు కారు వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్లాలని అడిగాడు. లోపల నటుడు మమ్ముట్టి ఉండటం చూసి ఆశ్చర్యపోయిన పాండ్యన్‌, వెంటనే తన ద్విచక్ర వాహనాన్ని (బైక్‌) తీసి మదురై వెళ్లే ప్రధాన రహదారి వరకు దాదాపు 10 కిలోమీటర్లు కారుకు ముందు వెళ్తూ సరైన దారి చూపించాడు.

యువకుడు పాండ్యన్‌ ఆనందం

మొదట దారి తెలీక ఇబ్బంది పడుతుంటే సాధారణంగానే వచ్చి మాట్లాడానని అయితే, లోపల నటుడు మమ్ముట్టిని చూడగానే మాటలు రాలేదన్నారు. వెంటనే బైక్‌పై ముందు వెళ్తూ మదురై రోడ్డు వరకు దారి చూపించానని పేర్కొన్నాడు. తనను కౌగిలించుకుని, సోషల్‌ మీడియాలో అభినందిస్తూ పోస్ట్‌ పెట్టడం రెట్టింపు సంతోషాన్నిచ్చిందన్నారు.

మమ్ముట్టి ఆనందం

– సోషల్‌ మీడియాలో పోస్ట్‌

సమయానికి వచ్చి దారి చూపించిన యువకుడి అభిమానానికి మురిసిపోయిన మమ్ముట్టి, కారు దిగి వచ్చి పాండ్యన్‌ను హత్తుకుని వీడియో తీసుకున్నారు. ఆ వీడియోలో అతడిని ‘నమ్మ ఫ్రెండ్‌’ అని పరిచయం చేస్తూ సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement