మాకు ప్రతి రోజూ పోరాటమే: సీమాన్‌ | - | Sakshi
Sakshi News home page

మాకు ప్రతి రోజూ పోరాటమే: సీమాన్‌

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

సాక్షి, చైన్నె: ‘కావేరీ నదీ జలాలు, మేఘదాతు ప్రాజెక్టు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అనేక సమస్యలపై తాము నిరంతరం పోరాడుతున్నాం. అందుకే తమకు రోజూ పోరాటమే... అదే మా జీవితంగా మారిపోయిందని నామ్‌ తమిళర్‌ కట్చి చీఫ్‌ కో–ఆర్డినేటర్‌ సీమాన్‌ వ్యాఖ్యానించారు. చైన్నెలో నామ్‌ తమిళర్‌ కట్చి ఆధ్వర్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నామ్‌ తమిళర్‌ కట్చి నాయకుడు సీమాన్‌తో పాటు పుదియ తమిళగం అధ్యక్షుడు కృష్ణసామి, తమిళగ వాల్వురిమై కట్చి నాయకుడు టి. వేల్‌ మురుగన్‌, కొంగు ఇళైంజర్‌ పేరవై నాయకుడు తనియరసు, సౌత్‌ ఇండియన్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌ నాయకుడు తిరుమారన్‌, పురట్చి భారతం పార్టీ నాయకుడు పూవై జగన్‌ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. కావేరీ నదీ జలాల వివాదాన్ని ఏటా ఎదుర్కొంటున్నామని ఈసందర్భంగా సీమాన్‌ వ్యాఖ్యానించారు. దీనికి తోడు కొత్తగా మేఘదాతు ప్రాజెక్టు సమస్య, నియోజకవర్గాల పునర్విభజన, మత్తు పదార్థాల వినియోగం పెరిగిపోవడం వల్ల జరుగుతున్న హత్యలు, లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్నామన్నారు. తమిళ జాతీయత అనే రాజ్యాంగం,రాజకీయ గొడుగు కింద తామంతా ఒకే శక్తివంతమైన రాజకీయ బలగంగా ఏకమవుతున్నామన్నారు. మేఘమలై ప్రాంతంలో తరతరాలుగా నివసిస్తున్న ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. ఆ ప్రాంతాలు ఆక్రమణకు గురయ్యాయని కేసు నమోదు చేశారు. ఎన్నో ఏళ్లుగా అక్కడే జీవిస్తున్న వారిని ఆక్రమణదారులు అని ఎలా అంటారు? ఇన్ని రోజులు చూసీచూడనట్లు ఉండి, ఇప్పుడు చర్యలు తీసుకోవడం ఏ రకంగా న్యాయం? అని ప్రశ్నించారు. కృష్ణస్వామి మాట్లాడుతూ, మాంజోలై ప్రాంత ప్రజల నివాస స్థలాలను మార్చకూడదని డిమాండ్‌ చేస్తూ అన్ని పక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 29న భారీ ధర్నా,నిరసన చేపడతామన్నారు. అలాగే సెప్టెంబర్‌ రెండో వారంలో మేఘమలై ప్రజల హక్కుల కోసం పోరాటం నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement