నైనార్‌ను అరెస్ట్‌ చేస్తే టీవీకే ప్రభుత్వానికే ముప్పు | - | Sakshi
Sakshi News home page

నైనార్‌ను అరెస్ట్‌ చేస్తే టీవీకే ప్రభుత్వానికే ముప్పు

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

– డీఎంకే సీనియర్‌ నేత దురైమురుగన్‌ వ్యాఖ్యలు

సాక్షి, చైన్నె : ఉదయనిధి స్టాలినన్‌ను అరెస్టు చేయడంలో చూపించిన వేగాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ విషయంలో తమిళనాడు ప్రభుత్వం చూపలేదని డీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దురైమురుగన్‌ వ్యాఖ్యానించారు. ఒకవేళ నైనార్‌ నాగేంద్రన్‌పై అలా చేయి వేస్తే, కేంద్ర ప్రభుత్వం ఒక్క రోజులోనే టీవీకే ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వేలూరు జిల్లా కాట్పాడిలోని తన నివాసంలో విలేకరులతో ఆదివారం మాట్లాడుతూ ఆయన పలు అంశాలపై స్పందించారు. ముఖ్యమంత్రి విజయ్‌ తల్లిపై నైనార్‌ నాగేంద్రన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వార్తను తాను పూర్తిగా చదవలేదని, అయితే నాగేంద్రన్‌ సాధు స్వభావి అని, శాంతంగా మాట్లాడే వ్యక్తి అని పేర్కొన్నారు. అయితే ఆయన ప్రవేశించిన వాతావరణం ప్రభావం అలా ఉందేమోనని ఎద్దేవా చేశారు. టీవీకే ప్రభుత్వం తన మద్దతుదారైన బీజేపీని అరెస్టు చేసే ధైర్యం చేయలేదని విమర్శించారు.

కర్ణాటక నీటి చౌర్యం – కావేరీ వివాదం:

కర్ణాటక నుంచి తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీరు సరిహద్దుకు వచ్చేసరికి తగ్గిపోతోందని, కర్ణాటక పరిధిలో నీటి దొంగతనం జరుగుతున్నట్లు అనుమానంగా ఉందని దురైమురుగన్‌ ఆరోపించారు. సరిహద్దులోని బిలిగుండ్లు వద్ద నీటి కొలతల ఆధారంగానే తమిళనాడుకు దక్కాల్సిన వాటాను ప్రభుత్వం గట్టిగా డిమాండ్‌ చేసి సాధించాలని సూచించారు. మేఘదాటు వద్ద ఆనకట్ట కడితే తమిళనాడు డెల్టా ప్రాంతాలు ఎండిపోయి కరువుబారిన పడతాయన్నారు. కాగా, ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయినా ఎలాంటి ఘనత సాధించలేదని, కేవలం మాటలకే పరిమితమై ఎన్నికల వాగ్దానాలను గాలికి వదిలేసిందని మండిపడ్డారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని దురైమురుగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.అన్నాడీఎంకే నేతలు టీవీకేలో చేరడంపై స్పందిస్తూ... ఎంజీఆర్‌ జీవించి ఉంటే ఈ దుస్థితి పట్టేది కాదన్నారు. ఎంజీఆర్‌ తన చివరి రోజుల్లో పార్టీని డీఎంకేలో విలీనం చేయాలని భావించినా, తర్వాత నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement