తమిళుల హత్యపై విచారణకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

తమిళుల హత్యపై విచారణకు డిమాండ్‌

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

● స్టాలిన్‌ సహా నేతల ఆగ్రహం ● కర్ణాటకలో ముగ్గురి కాల్చివేత ఘటనపై రాజుకుంటున్న వివాదం

సాక్షి, చైన్నె: కర్ణాటక అటవీ ప్రాంతంలో ముగ్గురు తమిళులను ఆ రాష్ట్ర అటవీ శాఖ సిబ్బంది దారుణంగా కాల్చి చంపిన ఘటనపై పారదర్శకమైన, నిష్పాక్షికమైన న్యాయ విచారణ జరిపించాలని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ సహా తమిళనాడులోని పలు పార్టీలు డిమాండ్‌ చేశాయి. బాధ్యులను కఠినంగా శిక్షించడంతో పాటు, మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. వివరాలు.. కర్ణాటకలోని చామరాజనగర్‌ జిల్లా, హానూర్‌ తాలూకా, తోమైయార్‌పాళయం గ్రామానికి చెందిన (తమిళ మూలాలున్న) రైతులు ఆంథోనీ రాజ్‌, జాన్‌, కుమార్‌లు అక్కడి అటవీ సిబ్బంది కాల్పులలో మరణించారు. ఈ సమాచారంతో తమిళనాడులోని పార్టీలలో ఆగ్రహం బయలుదేరింది. మేకలు, ఆవుల్ని తోలుకుని వెళ్లిన తమిళుల్ని అటవీ సిబ్బంది ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారన్న ఆగ్రహాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.

న్యాయ విచారణకు పట్టు..

డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఈ విషయంగా స్పందిస్తూ, మనిషి ప్రాణాలకు ఎలాంటి విలువ ఇవ్వకుండా అమానుషంగా జరిపిన ఈ కాల్పుల ఘాతుకం తీవ్రంగా ఖండించదగినదని పేర్కొన్నారు. నేరానికి పాల్పడిన సిబ్బందిని కాపాడేందుకు కర్ణాటక అటవీ శాఖ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ కేసును హత్య కేసు గా నమోదు చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు ఒడిగట్టే ధైర్యం ఎవరూ చేయలేరన్నారు. మేఘదాతు వ్యవహారంలో లాగా నోరు మెదపకుండా ఉండకుండా, ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వానికి తన తీవ్ర నిరసనను, ఖండనను నమోదు చేయాలని కోరారు.బాధిత కుటుంబాలకు తగిన ఆర్థిక నష్టపరిహారం ఇప్పించడంతో పాటు, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం స్పందిస్తూ, కర్ణాటక అటవీ శాఖ అధికారుల కాల్పుల్లో ముగ్గురు తమిళ రైతులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ఘాతుకంపై తమిళనాడు ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వానికి తన నిరసనను, ఖండనను తెలియజేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులు ఆంథోనీ రాజ్‌, జాన్‌, కుమార్‌లు తమ నిత్య క్రమంలో భాగంగా అడవిలోకి వెళ్లిన ఆవులను వెతుక్కుంటూ వెళ్లారని, అలాంటి వారిని కర్ణాటక అటవీ అధికారులు దారుణంగా కాల్చి చంపారని మండిపడ్డారు. తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికే వారు జింకలను వేటాడేందుకు వచ్చారని అటవీ శాఖ తప్పుడు ప్రచారం చేస్తోందని, ఈ కాల్పుల హత్యను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి స్పందిస్తూ, మృతులంతా తమిళనాడు సరిహద్దు గ్రామానికి చెందిన రైతులు , పశువుల కాపరులు అని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలోకి తప్పిపోయిన తమ ఆవులను, గేదెలను వెతుక్కుంటూ వెళ్లిన నిరాపరాదులైన తమిళులపై కర్ణాటక ఫారెస్ట్‌ సిబ్బంది అమానుషంగా కాల్పులు జరిపి చంపేశారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి అరెస్ట్‌ చేయాలని, తమిళనాడు ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వానికి తన నిరసనను తెలపాలని ఆయన కోరారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు సీబీఐను రంగంలోకి దించాలని డిమాండ్‌ చేశారు. అలాగే మరణించిన బాధితుల కుటుంబాలకు కర్ణాటక ప్రభుత్వం నుండి ఒక్కొక్కరికి రూ. కోటి నష్టపరిహారం ఇప్పించేలా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement