సాక్షి, చైన్నె : చైన్నె సమీపంలోని చెంగల్పట్టు జిల్లా కాట్టాంకోళత్తూర్ ఎస్‌ఆర్‌ఎం సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ 22వ స్నాతకోత్సవం ఆదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టాలు పొందిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘దేశమే ప్రథమం – దేశమే ముఖ్యం’ అనే సూత్రం ప్రాతిపదికగా తమ విజ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మక ఆలోచనలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఆయన పిలుపునిచ్చారు.
భవిష్యత్తును నిర్దేశించే సాంకేతికతలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్ పరిశోధన, రోబోటిక్స్, బయోటెక్నాలజీ , సుస్థిరాభివృద్ధి రంగాలపై ఎస్‌ఆర్‌ఎమ్ సంస్థ ప్రత్యేక దృష్టి సారించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సాంకేతికతలే భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థలను, సమాజాన్ని శాసిస్తాయని తెలిపారు. పరిశోధనలు కేవలం లాబొరేటరీలకే పరిమితం కాకుండా ప్రజల జీవిత ప్రమాణాలను పెంచేవిగా, పరిశ్రమలను బలోపేతం చేసే సాధనాలుగా మారినప్పుడే వాటికి నిజమైన గుర్తింపు లభిస్తుందన్నారు.
వికసిత్ భారత్ 2047 సాధనలో యువత పాత్ర
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ (వికసిత్ భార త్) సాధించాలనే లక్ష్యంలో నేడు పట్టాలు పొందుతు న్న విద్యార్థులు కీలకమైన ఘట్టంలో అడుగుపెడుతు న్నారని, స్వావలంబన కలిగిన నవ భారతాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ప్రధాని న రేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం 100కు పైగా దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేసిందని, చాలా పాశ్చాత్య దేశాలు పేద దేశాలకు సహాయం చేయని సమయంలో భారత్ వ్యాపార దృక్పథం లేకుండా మానవతా దృక్పథంతో నిలబడిందని గుర్తుచేశారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపు
తమిళనాడులో ఇటీవల డ్రగ్స్ వ్యాపార సమాచారం ఇచ్చినందుకు ఒక విద్యార్థి దారుణంగా హత్యకు గురైన సంఘటనపై ఉపరాష్ట్రపతి తీవ్ర దిగ్భ్రాంతి, వేదన వ్యక్తం చేశారు. సొంత కుటుంబాన్ని కోల్పోయినంత బాధ కలిగిందన్నారు. విద్యార్థులంతా అన్ని రకాల వ్యసనాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు.
ప్రధాన పురస్కారాలు..
మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ విభాగాధిపతి ఆర్. వేలుసామికి ఈ కార్యక్రమంలో ‘గౌరవ డాక్టరేట్’ను ఉపరాష్ట్రపతి అందజేశారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు , కేరళ రాష్ట్రాల గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఎస్‌ఆర్‌ఎమ్ చాన్సలర్ డాక్టర్ టి.ఆర్. పారివేందర్, ప్రొ–చాన్స్‌లర్లు డాక్టర్ రవి పచ్చముత్తు, డాక్టర్ పి. సత్యనారాయణన్, వైస్ చాన్స్‌లర్ డాక్టర్ సి. ముత్తమిళసెల్వన్ పాల్గొన్నారు.


