బాణసంచా పరిశ్రమ నిర్వీర్యానికి కుట్ర | - | Sakshi
Sakshi News home page

బాణసంచా పరిశ్రమ నిర్వీర్యానికి కుట్ర

Aug 17 2026 1:29 AM | Updated on Aug 17 2026 1:29 AM

● శివకాశి ధర్నాలో టీవీకే ప్రభుత్వంపై తంగం తెన్నరసు ఆరోపణలు

సాక్షి, చైన్నె : తమిళనాడులో అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే తమిళ వెట్రి కళగం ప్రభుత్వం బాణసంచా పరిశ్రమను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, డీఎంకే నాయకుడు తంగం తెన్నరసు ధ్వజమెత్తారు. బాణసంచా పరిశ్రమను రక్షించాలని డిమాండ్‌ చేస్తూ డీఎంకే నేతృత్వంలో తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ద్వారా చర్చకు పట్టుబట్టనున్నామన్నారు. విరుదునగర్‌ ఉత్తర జిల్లా డీఎంకే ఆధ్వర్యంలో బాణసంచా పరిశ్రమను నాశనం చేస్తున్న టీవీకే ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ శివకాశి బస్టాండ్‌ సమీపంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమానికి తంగం తెన్నరసు నాయకత్వం వహించగా, డీఎంకే నగర కార్యదర్శి ఉదయసూర్య పర్యవేక్షించారు.

10 లక్షల మంది కార్మికుల జీవనోపాధి

ధర్నాలో తంగం తెన్నరసు మాట్లాడుతూ, శివకాశి బాణసంచా, అగ్గిపెట్టెల పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ పరిశ్రమను కాపాడటం అంటే కేవలం కొన్ని యాజమాన్యాల కోసం కాదు, దీనిపైనే ఆధారపడి జీవిస్తున్న 10 లక్షల మంది పేద కార్మికుల పొట్ట కొట్టకుండా చూడటానికే అని స్పష్టం చేశారు. అక్కడక్కడా జరిగే చిన్న చిన్న ప్రమాదాలను సాకుగా చూపి మొత్తం పరిశ్రమను ముంచేయడం సరికాదన్నారు. అనుమతులు లేని అక్రమ తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకుంటే స్వాగతిస్తామని,అ యితే, లైసెన్సులు ఉన్న ఫ్యాక్టరీలపై తనిఖీల పేరుతో అధికారులతో వేధించడం దారుణమన్నారు.

చిల్లర వ్యాపారుల పొట్టకొడుతున్నారు

రిటైల్‌ పటాకుల షాపుల్లో గిఫ్ట్‌ బాక్సులు కూడా ఉంచుకోకుండా అధికారులు వ్యాపారుల పొట్ట కొడుతున్నారని, ఈ వేధింపులను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు. డీఎంకే పాలనలోనే శివకాశికి రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, బైపాస్‌ రోడ్డు, శివకాశి–విరుదునగర్‌ ఫోర్‌ లేన్‌ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని గుర్తుచేశారు. ఈ 3 నెలల టీవీకే పాలనలో ఉన్న పరిశ్రమలను కూడా నాశనం చేశారని మండిపడ్డారు. శివకాశిలో గెలిచిన పరిశ్రమల మంత్రి అసెంబ్లీకి రాకముందు అంబులెన్స్‌లు, ప్రతి 10 కిలోమీటర్లకు ఒక ఫైర్‌ స్టేషన్‌, ఇన్సూరెన్స్‌ అంటూ రీల్స్‌ తీసి సోషల్‌ మీడియాలో పెట్టారని గుర్తు చేశారు.అయితే, ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించి రూపాయి నిధులు కూడా కేటాయించలేదని ఎద్దేవా చేశారు. 3 నెలల్లో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకుంటున్న మంత్రి, సొంత నియోజకవర్గంలోని బాణసంచా పరిశ్రమను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారని ప్రశ్నించారు. డీఎంకే తెచ్చిన పథకాలకు పేర్లు మార్చి వెట్రి అని స్టిక్కర్లు వేసుకుంటున్నారని, ఇవి విజయవంతమైన పథకాలు కావు, శూన్యమైన పథకాలని ధ్వజమెత్తారు.100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శివకాశి బాణసంచా పరిశ్రమను, దానిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులను కాపాడేందుకు ప్రభుత్వం, అధికారులు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement