ఎంపీల భాగస్వామ్యం – గణాంకాలు | - | Sakshi
Sakshi News home page

ఎంపీల భాగస్వామ్యం – గణాంకాలు

Aug 9 2026 12:23 AM | Updated on Aug 9 2026 12:23 AM

దూరంగా డీఎంకే, అన్నాడీఎంకే, పీఎంకే ఎంపీలు

బహిష్కరణపై తలా ఓ మాట

హాజరైన మిత్రపక్షాలు

సాక్షి, చైన్నె: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ఎంపీల సమాలోచన పేరిట సీఎం విజయ్‌ తొలి ప్రయత్నంతో అడుగు ముందుకేశారు. అయితే ఈ సమావేశాన్ని డీఎంకే,అన్నాడీఎంకే, పీఎంకేలు బహిష్కరించాయి. అయినా, టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న పార్టీల ఎంపీలు ఈ సమావేశానికి హాజరుకావడంతో కీలక తీర్మానాలు ఆమోదించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై చర్చించేందుకు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ నేతృత్వంలో శనివారం నిర్వహించిన తమిళనాడు ఎంపీల ప్రత్యేక సమావేశాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలైన డిఎంకె, అన్నాడీఎంకేలతో పాటు పీఎంకే, ఎంఎన్‌ఎంకే, డీఎండీకే పార్టీలు బహిష్కరించాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం 57 మంది ఎంపీలలో 37 మంది హాజరు కాకపోగా, కేవలం 20 మంది ఎంపీలు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. వీరిలోనూ కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎంపీ డుమ్మా కొట్టారు.

డీఎంకే, అన్నాడీఎంకే బహిష్కరణకు ప్రధాన కారణాలు..

ఈ సమావేశం బహిష్కరణ గురించి డీఎంకే ఎంపీ కనిమొళి స్పందిస్తూ, కష్టాలలో ఉన్న రైతు సమస్యలు, కావేరి–మేఘదాతు ప్రాజెక్టు వివాదంపై ప్రతిపక్షాలన్ని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయన్నారు.అయితే దాన్ని పట్టించుకోకుండా సీఎం విజయ్‌, ఇంకా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టని బిల్లుపై ఎంపీల సమావేశం పేరిట నాటకం ఆడుతున్నారని, ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని మండిపడ్డారు. డీఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌.ఎస్‌. భారతి స్పందిస్తూ, పునర్విభజన బిల్లు ఇంకా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనేలేదని, పుట్టని బిడ్డకు పేరు పెట్టడం లాంటిది ఈ సమావేశం. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దానిలోని సవరణలను చూసి తమ నేత స్టాలిన్‌ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. డీఎంకే ద్వారా ఎంపీగా ఎన్నికై న కమలహాసన్‌ నేతృత్వంలోని మక్కల్‌ నీది మయ్యం కట్చి(ఎంఎన్‌ఎంకే), ప్రేమలత విజయకాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే సైతం బహిష్కరించడం గమనార్హం.

ప్రభుత్వం వైఫల్యాలను

కప్పిపుచ్చుకునే ప్రయత్నం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి స్పందిస్తూ, మేటూరు డ్యామ్‌ను ఇంకా తెరవలేదని, డెల్టా జిల్లాల్లో తాగునీరు, సాగునీరు లేక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై సత్వర పరిష్కారం చూపాల్సిన ప్రభుత్వం, పార్లమెంట్‌లో లేని ఒక ముసాయిదాను సాకుగా చూపిస్తూ రాజకీయం చేస్తున్నట్టు ధ్వజమెత్తారు. కాగా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మేఘదాతు వివాదంపై అఖిలపక్ష భేటీ కోరగా, సీఎం విజయ్‌ దానిని తిరస్కరించడంపై కూడా ప్రతిపక్షాలు తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రతి పక్షాలు ఈ సమావేశాన్ని బహిష్కరించడం గమనార్హం.

నియోజకవర్గ పునర్విభన బిల్లుపై ప్రత్యేక సమావేశం

రాష్ట్రంలో మొత్తం 57 మంది లోక్‌ సభ, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. ఇందులో డీఎంకే (30), అన్నాడీఎంకే (4), పీఎంకే (1), డీఎండీకే (1), ఎంఎన్‌ఎంకే (1) ఉన్నారు. వీరంతా సమావేశాన్ని బహిష్కరించగా టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాంగ్రెస్‌ (12), వీసీకే (2), సీపీఎం (2), సీపీఐ (2), ఐయుఎమ్‌ఎల్‌ (1), ఎండిఎంకె (1) చొప్పున మొత్తం 20 మంది ఎంపీలు ఈ సమావేశంలో మెజారిటీగా ఉన్నారు. వీరిలోనూ ఒక కాంగ్రెస్‌ ఎంపీ డుమ్మాకొట్టారు. అయినా, సీఎం విజయ్‌ నేతృత్వంలో కలైవానర్‌ అరంగం వేదికగా జరిగిన సమావేశంలో కేంద్రం తీరుపై ఎంపీలు తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్లమెంట్‌కు వస్తే బిల్లును అడ్డుకునే దిశగా సిద్ధమయ్యారు. బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. కావేరి, మేఘదాతు వ్యవహారంలో అఖిల పక్షంకు డీఎంకే పట్టుబడుతూ షరతు విధించినా, తన తొలి ప్రయత్నంలో సంకీర్ణ పార్టీల ఎంపీల మద్దతును కూడ గట్టుకుని సీఎం విజయ్‌ అడుగుముందుకేశారు. లోక్‌ సభ నియోజకవర్గం పునర్విభజనకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో తమిళనాడు నుంచి తాను సైతం అన్నట్టుగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement