సాక్షి, చైన్నె : చైన్నెలోని కలైవానర్ అరంగంలో తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక చేనేత ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రారంభించారు. తమిళనాడు చేనేత శాఖ ఆధ్వర్యంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. చేనేత ప్రదర్శన–2026తో పాటు కో–ఆప్టెక్స్ సంస్థకు చెందిన ‘వెట్రి తరి’ ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని సీఎం విజయ్ ప్రారంభించారు.అలాగే, 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ చేనేత కార్మికులు, డిజైనర్లుగా ఎంపికై న 11 మందికి సీఎం విజయ్ చేతుల మీదుగా రూ. 22.25 లక్షల విలువైన చెక్కులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ ప్రదర్శన ఈ నెల 13 వతేదీ వరకు జరగనుంది.
కాంచీపురం, ఆరణి, తిరుభువనం పట్టు చీరలు, కోయంబత్తూర్ గోరా కాటన్, నెగమం కాటన్ చీరలు, సేలం పట్టు పంచెలు, గృహోపయోగ వస్త్రా లు అందుబాటులో ఉంచారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖ చేనేత బ్రాండ్లు అయిన తంతుజాన్, మృగనాయని, గుజ్జారి, బయోనిక ఉత్పత్తులను కూడా ప్రదర్శనలో విక్రయానికి ఉంచారు.
వెట్రి తరి సేల్స్ పాయింట్
నేత కార్మికుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహాయంతో కో–ఆప్టెక్స్ ఆధ్వర్యంలో వెట్రి తరి విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు పి. వెంకటరమణన్, ఎం. విజయ్ బాలాజీ, జగదీశ్వరి, సి. రమేశ్, పి. మదన్ రాజా, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


