తిరుత్తణిలో మొక్కులు చెల్లించిన ఏపీ మాజీ మంత్రి రోజా | - | Sakshi
Sakshi News home page

తిరుత్తణిలో మొక్కులు చెల్లించిన ఏపీ మాజీ మంత్రి రోజా

Aug 9 2026 12:23 AM | Updated on Aug 9 2026 12:23 AM

తిరుత్తణి: మాజీమంత్రి ఆర్‌కే రోజా శనివారం తిరుత్తణి ఆలయంలో కావడి చెల్లించి స్వామిని దర్శించుకున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆడికృత్తిక సందర్భంగా ఏటా ఏపీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే.రోజా కావడి మొక్కు చెల్లించి స్వామిని దర్శించుకోవడం పరిపాటి. ఆడికృత్తిక ఉత్సవ వేడుకల్లో చివరిరోజైన శనివారం ఉదయం మాజీ మంత్రి రోజూ కావడితో తిరుత్తణి కొండ ఆలయం చేరుకున్నారు. ఆమెకు ఆర్‌ఐ మణిభారతి ఆధ్వర్యంలో అధికారులు స్వాగతం పలికారు. ఆలయంకు ప్రత్యేక దర్శన మార్గంలో తీసుకెళ్లి మూలవర్లను దర్శించుకున్నారు. అనంతరం షణ్ముఖర్‌ మండపంలో కావడి చెల్లించారు.

హైకోర్టు కొత్త న్యాయమూర్తుల నియామకం

– సీఎం విజయ్‌ శుభాకాంక్షలు

సాక్షి, చైన్నె: మద్రాసు హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. వీరికి సీఎం విజయ్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. మద్రాసు హైకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులను భర్తీ చేసే విధంగా సుప్రీం కోర్టు కొలిజీయం చేసిన సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఆమోదించారు. వీరిలో గోవిందరాజన్‌ కృష్ణ స్వామి, రజనీష్‌ పదియిల్‌, రమేష్‌ నటరాజన్‌, జి.కె. ముత్తుకుమార్‌, రామకృష్ణన్‌ రాజేష్‌ వివేకానందన్‌లు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. అలాగే, అదనపు న్యాయమూర్తులుగా రవికుమార్‌ శంకరనారాయణన్‌, దిలీప్‌ కుమార్‌ నాగరాజన్‌ ఎల్లాప్పన్‌ మనోహరన్‌, డాక్టర్‌ పి. మురుగన్‌, ఎమ్‌.టి. సుమతి, ఎస్‌. అల్లి, సి. తిరుమగళ్‌, షణ్ముగం కార్తికేయన్‌, మురుగేసన్‌ బాలుస్వామి, ఎన్‌. గుణశేఖరన్‌లు నియమించబడ్డారు.భారత రాష్ట్రపతి ద్వారా హైకోర్టుకు కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులకు అభినందనలు తెలుపుతూ సీఎం విజయ్‌ ప్రకటన విడుదల చేశారు. న్యాయవ్యవస్థ ఘనతను, రాజ్యాంగ విలువలను కాపాడుతూ.. ప్రజలందరికీ సమాన న్యాయం, సామాజిక న్యాయం అందేలా మీ సేవలు అత్యుత్తమంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను అని సీఎం విజయ్‌ తన సందేశంలో పిలుపునిచ్చారు.

చెక్కు బౌన్స్‌ కేసులో నటుడు శరత్‌కుమార్‌కు సమన్లు

సాక్షి, చైన్నె : చెక్కు బౌన్స్‌ కేసులో నటుడు, బీజేపీ నేత శరత్‌కుమార్‌ సెప్టెంబర్‌ 10న కోర్టులో స్వయంగా హాజరుకావాలని చైన్నె సైదాపేట కోర్టు సమన్లు జారీ చేసింది. తన వ్యక్తిగత రుణాలను తీర్చేందుకు గాను నటుడు శరత్‌కుమార్‌, చైన్నెకి చెందిన శ్రీకృష్ణ అనే వ్యక్తి వద్ద 2025 ఏప్రిల్‌లో రూ 2 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో శరత్‌కుమార్‌ ఇచ్చేందుకు జారీ చేసిన చెక్కు, బ్యాంక్‌ ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో బౌన్స్‌ అయింది. దీంతో బాధితుడు శ్రీకృష్ణ, శరత్‌కుమార్‌పై చైన్నెలోని సైదాపేట కోర్టులో చెక్కు బౌన్స్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సైదాపేట కోర్టు, కేసు విచారణ నిమిత్తం నటుడు శరత్‌ కుమార్‌ సెప్టెంబర్‌ 10న తమ ఎదుట నేరుగా హాజరుకావాలని ఆదేశిస్తూ సమన్లు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.

పోలీస్‌ స్టేషన్‌లో నిప్పంటించుకున్న వృద్ధుడి మృతి

అన్నానగర్‌: తిరువొత్తియూర్‌ జిల్లా, కాలడిప్పేట్టై, పుదు పేట్టైలోని పుదు వీధి ప్రాంతానికి చెందిన కుమార్‌(66). ఇతనికి ఉష, భారతి, మరి అనే ముగ్గురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం మధ్యాహ్నం తిరువొత్తియూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన కుమార్‌, తన కుటుంబ సభ్యులు తనను పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లగొట్టారని అక్కడి సబ్‌–ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఆ తర్వాత అకస్మాత్తుగా పోలీస్‌ స్టేషన్‌ ప్రవేశ ద్వారం వద్ద నిలబడి, తాను సిద్ధంగా తెచ్చుకున్న ఒక లీటరు పెట్రోల్‌ను తనపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నీళ్లు పోసి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో వృద్ధుడిని చికిత్స కోసం 108 అంబులెనన్స్‌లో కిల్పాక్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక అతను శనివారం ఉదయం మృతి చెందాడు. పోలీస్‌ స్టేషన్‌లో వృద్ధుడు తనకు తాను నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement