సాక్షి, చైన్నె: వ్యవసాయ రుణాలను సంపూర్ణంగా మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ పోరాడుతున్న రైతు సంఘాల ప్రతినిధులతో తమిళనాడు ప్రభుత్వ మంత్రుల బృందం నిన్న చైన్నె సచివాలయంలో చర్చలు జరిపింది. రైతుల కోరికలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల్సిందేనని ఈసందర్భంగా రైతు సంఘాల ప్రతినిధులుపట్టుబట్టారు. ఎన్నికల వాగ్దానం మేరకు కొంత మేరకు పంట రుణాలను రద్దు చేస్తూ సీఎం విజయ్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల వాగ్ధానంగా పూర్తి స్థాయిలో రుణాల రద్దు అని ప్రకటించి, ఇప్పుడు కంటి తుడుపు చర్యగా కొంత మేరకు మాఫీని రైతులు అంగీకరించ లేదు. పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ రైతు సంఘాలు వరుస నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ఆ ప్రతినిధులతో సమావేశానికి సీఎం విజయ్ ఆదేశించారు. దీంతో సచివాలయంలో మంత్రులు ఎన్. ఆనంద్, ఆదవ్ అర్జున, కె.ఎ. సెంగోట్టయ్యన్, సి.టి. నిర్మల్ కుమార్, రాజ్ మోహన్, వినోద్, వెంకటరమణన్, గాంధీరాజ్ నేతృత్వంలో చర్చలు జరిగాయి. ఆర్థిక శాఖ కార్యదర్శి సిద్దిక్, సహకార శాఖ కార్యదర్శి పి. అముద, వ్యవసాయ శాఖ కార్యదర్శి పొన్. శంకర్. ఎమ్మెల్యేలు తళి రామచంద్రన్, కీళ్వేళూరు లతా, తిరుత్తురైపూండి కె. మారిముత్తు, రైతు ప్రతినిధుల పీ ఆర్. పాండియన్, పి. అయ్యాకన్ను, స్వామిు నటరాజన్, పి.ఎస్. మాసిలామణి, రవీంద్రన్ సహా 25 రైతు సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వారు ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఉంచారు.
రుణమాఫీ అమలు
టీవీకే ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు చిన్న, సన్నకారు రైతులకు 100శాతం, పెద్ద రైతులకు 50శాతం రుణాలను ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేయాలలని, గడువు ముగిసే సమయంలో వడ్డీ, వాయిదాలు చెల్లించిన రైతులకు కూడా ఈ రుణమాఫీ ప్రయోజనం వర్తింపజేయాలని, రేషన్ కార్డుకు ఒకరికే మాఫీ అనే వివక్ష ఉండకూడదని, . గత ప్రభుత్వాల హయాంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడూ వర్తింపజేయాలని రైతు సంఘాల నేతలు సమావేశంలో పట్టుబట్టారు.అలాగే, మద్దతు ధరల పెంపు గురించి పేర్కొంటూ వరి క్వింటాలుకు రూ. 3,500, చెరకు టన్నుకు రూ.4,500 చొప్పున మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు.
చర్చల అనంతరం రైతు నాయకుల స్పందన
తమిళనాడు రైతు సంఘాల సమన్వయ కమిటీ అధ్యక్షుడు పీ.ఆర్. పాండియన్ మాట్లాడుతూ, రైతుల డిమాండ్లన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారని తలలెఇపారు.ు అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.దక్షిణ భారత నదుల అనుసంధాన నిరసనల నాయకుడు అయ్యాకన్ను మాట్లాడుతూ, ఏకంగా 8 మంది మంత్రులు ఒకేసారి పాల్గొని రైతుల సమస్యలను వినడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు. ఒక వారంలో తమ డిమాండ్లపై మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామన్నారు.


