ఆలయాల్లో సెల్‌ ఫోన్లు, రీల్స్‌పై కఠిన ఆంక్షలు | - | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో సెల్‌ ఫోన్లు, రీల్స్‌పై కఠిన ఆంక్షలు

Aug 9 2026 12:23 AM | Updated on Aug 9 2026 12:23 AM

– దేవాదాయ శాఖ కొత్త మార్గదర్శకాలు

సాక్షి, చైన్నె : తమిళనాడులోని ఆలయాల పవిత్రతను కాపాడటానికి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ఆలయాల ప్రాంగణంలో సెల్‌ ఫోన్ల వాడకం, ఫొటోలు, సోషల్‌ మీడియా రీల్స్‌ చిత్రీకరించడంపై పూర్తి నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. దేవాదాయ శాఖ మంత్రి రమేష్‌ సూచనల మేరకు దేవాదాయ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.జి. వినయ్‌ అన్ని ఆలయాల నిర్వహణ అధికారులకు ప్రత్యేక ఉత్తర్వులుజారీ చేశారు.

సేఫ్టీ డిపాజిట్‌ బాక్స్‌ సదుపాయం

ఆలయంలోకి ప్రవేశించే ముందే భక్తులు తమ సెల్‌ ఫోన్లను సురక్షితంగా దాచుకోవడానికి ప్రవేశ ద్వారాలు లేదా పాదరక్షల నిల్వ కేంద్రాల వద్ద భద్రతా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేది నుంచి సెల్‌ ఫోన్లను ఇక్కడ కేటాయించాల్సి ఉంటుంది. ఇందుకు రుసుంగా రూ. 5 వసూలు చేసి రసీదు జారీ చేస్తారు.

పర్యవేక్షణ – పోలీసులకు ఫిర్యాదు:

ఫోన్ల వాడకాన్ని నియంత్రించేందుకు, నియమాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని వాలంటీర్లను నియమించనున్నారు. అనుమతి లేకుండా ఆలయం లోపల ఫోటోలు, వీడియోలు తీసే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తగిన చర్యలు తీసుకుంటారు. ఆలయ ప్రాంగణంలో సెల్‌ ఫోన్ల వాడకం నిషేధించబడిందనే హెచ్చరిక నోటీసు బోర్డులను స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయనున్నారు. ఆలయ లౌడ్‌స్పీకర్ల ద్వారా నిరంతరం ఈ సమాచారాన్ని మైకుల్లో ప్రకటించేందుకు నిర్ణయించారు.

వీఐపీలు, సినీ సెలబ్రిటీ దర్శనాలపై కొత్త ఆంక్షలు

సినీ ప్రముఖులు లేదా వీఐపీలు దైవదర్శనానికి వస్తున్నట్లయితే, వారి రాక సమయం, ఆలయ విభాగం, వెంట వచ్చే జనం వివరాలను కనీసం ఒక రోజు ముందుగా (24 గంటలు) కమిషనర్‌ కార్యాలయానికి తెలియజేయాలి. విఐపిలు,సెలబ్రిటీల సందర్శన సమయంలో కూడా ఆలయం లోపల ఫోటోలు, వీడియో రీళ్లు తీయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వరు. ముందస్తు అనుమతి పొందిన అధికారులు, భద్రతా సిబ్బంది మాత్రమే వీఐపీలతో పాటూ లోపలికి వెళ్లడానికి అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement